
డోనాల్ ట్రంప్ ప్రపంచ శాంతికి భంగం
అమెరికాకు మోడీ దాసోహం
సిపిఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకట రెడ్డి
మన తెలంగాణ/హైదరాబాద్: జవహర్ లాల్ నేహ్రూ నేతృత్వంలోని ప్రభుత్వం అలీనోద్యమానికి నాయకత్వం వహించి, ప్రపంచ శాంతికి కృషి చేయగా, ప్రస్తుత మోడీ ప్రభుత్వం అమెరికాకు దాసోహమైందని సిపిఐ జాతీయ కార్యదర్శి, మాజి ఎంఎల్‌ఎ పల్లా వెంకట రెడ్డి విమర్శించారు. ప్రపంచంలోని ఖనిజ సంపద, చమురు నిక్షేపాలపై అధిపత్యం కోసమే అమెరికా సామ్రాజ్యవాదం యుద్ధాలు చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కమ్యూనిస్టు పార్టీలకు ప్రపంచ శాంతే శాశ్వత ఎజెండా అని ఆయన ఉద్ఘాటించారు. హైదరాబాద్ మఖ్ధూంభవన్‌లో శనివారం అఖిల భారత శాంతి సంఘీభావ సంఘం (ఐప్సో) రాష్ట్ర సమన్యయ ప్రధాన కార్యదర్శి కెవిఎల్ రచించిన ‘ప్రపంచ శాంతి కోసం కమ్యూనిస్టు పార్టీ ఉద్యమం’ అనే పుస్తక పరిచయ సమావేశం జరిగింది.
ఈ సమావేశానికి ఐఎఎల్ జాతీయ ప్రధాన కార్యదర్శి బొమ్మగాని ప్రభాకర్ అధ్యక్షత వహించగా, పల్లా వెంకట్ రెడ్డితో పాటు మాజి ఎంఎల్ ఐప్సో జాతీయ నాయకులు కె. యాదవ రెడ్డి, ఐప్సో నాయకులు ఓబేదుల్లా కోత్వాల్, డాక్టర్ డి.సుధాకర్, పి.ప్రేమ్ పావని హాజరయ్యారు. ఈ సందర్భంగా పల్లా వెంకట రెడ్డి మాట్లాడుతూ రెండు ప్రపంచ యుద్ధాలతో అనేక దేశాలు తీవ్రమైన సంక్షోభాల్లో కూరుకపోయాయని, సోవియేట్ యూనియన్ నేతృత్వంలో సోషలిస్ట్ శిబిరం ఉండటం వల్లనే మూడవ ప్రపంచ యుద్ధం రాలేదన్నారు.
డోనాల్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడయ్యాక ప్రపంచ శాంతికి భగం వాటిల్లిందని, ఇరాన్, ఇజ్రాయిల్, అమెరికాలు యుద్ధం చేస్తున్నాయని అన్నారు. ఇరాన్ కూడా సమర్థవంతంగా ఎదుర్కొంటున్నదని తెలిపారు. కెవిఎల్ 24 పుస్తకాలు రాయడం సాధారణ విషయం కాదన్నారు. ప్రపంచ శాంతి కోసం కమ్యూనిస్టు పార్టీ ఉద్యమం అనే పుస్తకం ప్రతి ఒక్కరూ చదవాలన్నారు. సోవియేట్ యూనియన్ శిబిరంలో ఉన్న క్యూబా అమెరికాను గడగడలాడించిందని, క్యూబాను అమెరికా ఏమిచేయలేకపోయిందని పల్లా వెంకట రెడ్డి చెప్పారు.
ఏడాది యుద్ధం ఖర్చుతో 200 ఏళ్లకు విద్య, వైద్యం: యాదవ రెడ్డి
ఒక ఏడాది యుద్దానికి అయ్యే వ్యయంతో 200 ఏళ్లకు సరిపడే విద్య, వైద్యం ఉచితంగా అందించవచ్చని యాదవ రెడ్డి అన్నారు. ప్రస్తుతం జరుగుతున్నది మూడవ ప్రపంచ యుద్ధమే నన్నారు. శాంతి కోసం ప్రపంచ వ్యాప్తంగా కమ్యూనిస్టు పార్టీ పోరాడుతోందన్నారు. దేశంలో కమ్యూనిస్టు పార్టీలన్నీ ఏకమైతే పేదలకు మేలు జరుగుతుందన్నారు. డాక్టర్ డి.సుధాకర్ మాట్లాడుతూ కెవిఎల్ రచనలు సమాజానికి స్పూర్తిదాయకమన్నారు. కెవిఎల్ రాసిన పుస్తకాలను క్యూబాలో ఆవిష్కరించామని గుర్తు చేశారు.
ఒబెదుల్లా కోత్వాల్ మాట్లాడుతూ కెవిఎల్ శాంతి సంఘంలో సభ్వత్వం నుంచి నిర్మాణం వరకు పట్టుదలగా కృషి చేస్తారన్నారు. పుస్తకాలు రాయడం ద్వారా యువతకు మార్గదర్శిగా పనిచేస్తారన్నారు. పేమ్ పావని మాట్లాడుతూ గతంలో అలీనోద్యమానికి నాయకత్వం వహించిన భారతదేశం మూడవ ప్రపంచ యుద్ధాన్ని నివారించిందన్నారు. ప్రస్తుతం మోడీ ప్రభుత్వం అమెరికాకు ఊడిగం చేస్తూ, అమెరికా, ఇరాన్ యుద్ధం విషయంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఐప్సో ప్రధాన కార్యదర్శులు డాక్టర్ కాచం సత్యనారాయణ, పడాల నళిని, రాంచంద్రా రెడ్డి, పోలగాని రవికిషోర్, అరసం నాయకులు రాపోలు సుదర్శన్, బొమ్మగాని నాగభూషణం, జిఎస్ రిటైర్డ్ అధికారి లక్ష్మయ్య, నాయకులు డి.జి.నరేంద్ర ప్రసాద్, కె.శ్రీశైలం గౌడ్ తదితరులు పాల్గొన్నారు.