
హైదరాబాద్ : మహిళా సాధికారత సాధించకుండా దేశ ప్రగతిని ఊహించలేమని తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ మాజీ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు అన్నారు. శనివారం బ్లిస్ బర్గ్ ఫ్యూచర్ ఆఫ్ హోప్ ప్రముఖ అంతర్జాతీయ సంస్థ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.
మహిళలను గౌరవించని సమాజం పురోగతి సాధించలేదని జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు డాక్టర్ దుండ్ర కుమారస్వామి అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ వకులాభరణం కృష్ణమోహన్ రావు ముఖ్యఅతిథిగా, కార్యక్రమం ప్రధాన నిర్వహకుడిగా దుండ్ర కుమారస్వామి విశిష్ట అతిథిగా, ఆర్పి పట్నాయక్, వివిధ రంగాల చెందిన ప్రముఖులు , డాక్టర్ వినయ్ పాండురంగ తదితరులు డాక్టర్ హరికుమార్ అతిథులుగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా హైదరాబాద్ నగరంలో వివిధ రంగాలలో విశిష్ట సేవలు అందిస్తున్న 25 మంది మహిళా మూర్తులకు పురస్కారాలు అందజేసి ఘనంగా సన్మానించారు. సభలో డాక్టర్ వకుళాభరణం ప్రసంగిస్తూ, సనాతనంగా మహిళలను గౌరవించడం కొనసాగుతున్నప్పటికీ ఆధునిక వ్యవస్థలో క్రైమ్ రేటు పెరగడం పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం స్త్రీల పట్ల ఆందోళన కలిగించే సంఘటనలు పెరిగాయని ఎన్సీఆర్‌బీ నివేదికలో పేర్కొనబడడం విచారకరమని అన్నారు. ఈ పరిణామాలు సమాజానికి మంచిది కాదని ఆయన అన్నారు.
జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు, దుండ్ర కుమారస్వామి మాట్లాడుతూ, మహిళల అభివృద్ధి జరిగినప్పుడే సమాజం అభివృద్ధి చెందుతుందని, దేశం కూడా అభివృద్ధి సాధిస్తుందని అన్నారు. మహిళల సాధికారత కోసం ప్రతి ఒక్కరు కృషి చేయడం అందరి బాధ్యత అని పేర్కొన్నారు.
ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్. పి. పట్నాయక్ ప్రసంగిస్తూ, స్త్రీ తల్లిగా, అమ్మమ్మగా వివిధ రూపాలలో మన జీవితాల్లో ఉండే అనుభూతి ఎంతో మాధుర్యమైనదని అన్నారు. స్త్రీని గౌరవించడంలో తల్లిని చూడాలని ఆయన అభిప్రాయపడ్డారు.
ఈ కార్యక్రమంలో డాక్టర్ సుధావాణి, డాక్టర్ లక్ష్మీ, డాక్టర్ హరికృష్ణ, డాక్టర్ భాటియా, విద్యాసంస్థల అధినేత మేఘన, ప్రముఖ సినీనటి కైరా అద్వానీ,సింగర్ మమత, డాక్టర్ రమాదేవి, ప్రొఫెసర్ రేఖా దయాల్, శశిబాల రామ్మోహన్ రావు, ప్రముఖ రచయిత్రి పవిత్ర సింధూరన్, ప్రముఖ తమిళ నటి తదితరులు పాల్గొన్నారు.