
పాట్నా: బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కుమారుడు నిశాంత్ ఆదివారం అధికారికంగా జెడి(యు)లో ప్రవేశించడానికి రంగం సిద్ధమైంది. ఇది జెడి(యు) నాయకత్వంలో తరం మార్పును సూచిస్తోంది. పార్టీ ప్రధాన కార్యాలయంలో సీనియర్ నాయకులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్‌ఎల్‌ఎలు, ఎమ్‌ఎల్‌సిల సమక్షంలో నిశాంత్ ప్రవేశం జరుగుతుందని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. బీహార్ రాష్ట్రంలో సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా పాలించిన నితీశ్ కుమార్ మార్చి 16న రాజ్యసభ ఎన్నికల కోసం నామినేషన్ దాఖలు చేయడంతో ఈ పరిణామాలు సంభవించాయి.
“జేడీ(యు) నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ సంజయ్ ఝా నివాసంలో శుక్రవారం పార్టీ ఎమ్‌ఎల్‌ఎలు, ఎంఎల్‌సిలను నిశాంత్ కుమార్ కలుసుకుని తన భవిష్యత్ రాజకీయ వ్యూహాలపై చర్చించారు. ఆదివారం నాడు అధికారికంగా పార్టీ లోకి ప్రవేశించిన తరువాత నిశాంత్ క్రియాశీల రాజకీయాల్లోకి ప్రవేశించడంపై నిర్ణయం అవుతుందని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఈ సమావేశంలో సీనియర్ జేడి(యు ) నాయకుడు, బీహార్ ఏకైక మంత్రి శ్రావణ్ కుమార్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. రాజ్యసభ ఎంపీగా నితీశ్ కుమార్ ఢిల్లీ వెళ్లడానికి నిర్ణయం తీసుకోవడంపై జేడీ(యు) శాసనసభ్యులు శుక్రవారం ఆవేదన వ్యక్తం చేశారు. కానీ నిశాంత్ రాజకీయ ప్రవేశం దగ్గరపడుతుండడంతో ఓదార్పు చెందారు.
నితీష్ కుమార్ ఆకస్మిక నిర్ణయానికి ఉభయ శాసనసభల , పార్లమెంట్ ఉభయ సభల సభ్యుల మద్దతు ఉంటోంది. శుక్రవారం సిఎం నితీశ్ కుమార్ నివాసంలో జరిగిన సమావేశంలో ఈమేరకు మద్దతు ప్రకటించారు. ముఖ్యమంత్రి నితీష్‌కుమార్ స్వంతంగానే ఈ నిర్ణయం తీసుకున్నారని, ఇందులో ఎవరి బలవంతం లేదని శాసనసభ్యులు వెల్లడించారని, నితీశ్ కుమార్ కూడా తాను రాష్ట్ర పార్టీ కార్యకర్తలకు నిత్యం అందుబాటులో ఉండి మార్గదర్శకాలు సూచిస్తుంటానని హామీ ఇచ్చారని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి విజయ్‌కుమార్ చౌదరి విలేకరులకు వివరించారు. పార్టీలో నిశాంత్ ప్రవేశానికి సిఎం నితీష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ఒక ప్రశ్నకు సమాధానంగా ఆయన చెప్పారు.