
హైదరాబాద్: సిఎం రేవంత్ రెడ్డి సమక్షంలో 130 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వారిలో 125 మంది ఛత్తీస్‌గఢ్‌కు చెందినవారని తెలుస్తోంది. మిగితా వారిలో తెలంగాణకు చెందిన వాళ్లు నలుగురు కాగా.. ఒకరు ఎపికి చెందిన వారు. లొంగిపోయిన మావోయిస్టులు 124 ఆయుధాలను సిఎంకు అప్పగించారు. అనంతరం సిఎం మీడియాతో మాట్లాడుతూ.. లొంగిపోయిన మావోలు మంచి జీవితం గడిపేలా ప్రభుత్వం కృషి చేస్తుందని హామీ ఇచ్చారు. భారీ సంఖ్యలో మావోయిస్టులు లొంగిపోయేలా పోలీసులు కృషి చేశారని అన్నారు. పోలీసులు నక్సలైట్లలో ఓ నమ్మకాన్ని కల్పించారని తెలిపారు. ఈ సందర్భంగా డిజిపి శివధర్ రెడ్డి, డిజిపి సుమతిని అభినందిస్తున్నానని అన్నారు.
అహింసా పద్ధతిలోనే బ్రిటీషర్లపై పోరాడి స్వాతంత్ర్యం తెచ్చుకున్న చరిత్ర మనది అని సిఎం అన్నారు. హింస, ఆయుధాలతో పోరాటం ఒక్కటే పరిష్కారం కాదని గాంధీ చాటి చెప్పారని తెలిపారు. అణ్వాయుధాలు ఉన్న దేశాలు కూడా ఇవాళ చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకుంటున్నాయని పేర్కొన్నారు. ఇంకా అజ్ఞాతంలో ఉన్న నక్సలైట్లకు విజ్ఞప్తి చేస్తున్నానని.. ప్రజలతో మమేకమై కలిసి ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని అన్నారు. దేవ్‌జీ, ఆయన మిత్ర బృందం కొన్ని ప్రతిపాదనలు చేశారని.. తమ సమస్యలను పరిష్కరిస్తే లొంగిపోతామని చెప్పారని తెలిపారు. రాష్ట్రస్థాయిలో మేము చేయగలిగింది చేస్తామని నక్సలైట్ నేతలు చెప్పానని అన్నారు. నక్సలైట్ నేతల డిమాండ్లను కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో చర్చించానని.. లొంగిపోయిన వారి మెరుగైన జీవితానికి హామీ ఇవ్వాలని అమిత్ షా సూచించారని పేర్కొన్నారు.
అమిత్ షాతో చర్చల తర్వాత నక్సలైట్ నేతలతో మళ్లీ చర్చించానని.. లొంగిపోయిన మావోయిస్టులకు పునరావాస ప్యాకేజీతో పాటు ఆరోగ్య భద్రత కార్డు కల్పిస్తామని సిఎం హామీ ఇచ్చారు. నిమ్స్ వంటి ఆస్పత్రుల్లో మెరుగైన వైద్య సేవలు పొందే ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. మావోయిస్టుల హోదాలను బట్టి ప్యాకేజీ కల్పిస్తామని చెప్పారు. ఇంటి స్థలం, ఇందిరమ్మ ఇల్లు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. రాష్ట్రంలో భూమి లభ్యత కష్టంగా ఉన్నందున భూమి ఇవ్వటంపై హామీ ఇవ్వలేనని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో హింసకు తావులేదు.. అక్రమంగా ఆయుధాలు కలిగి ఉంటే సహించేదని లేదని హెచ్చరించారు.
ఇంకా అజ్ఞాతంలో ఉన్న గణపతితో సహా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నానని.. గణపతి ఆరోగ్యం బాగా లేదని తెలిసింద.. ఆయన కూడా లొంగిపోవాలని రేవంత్ కోరారు. గణపతి లొంగిపోతే ఆయనకు రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చారు. సెంట్రల్ కమిటీ, స్టేట్ కమిటీలో ఉన్న వాళ్లు జనజీవన స్రవంతిలో కలిసిపోవాలని విజ్ఞప్తి చేశారు. అందరూ కలిసి వస్తే తెలంగాణను పునర్నిర్మించుకుందామని పిలుపునిచ్చారు. గూడేలు, తండాల్లో ఉన్నవారి మెరుగైన జీవితానికి కృషి చేద్దామని అన్నారు. ఆదివాసీ, గిరిజనుల ఆర్థికస్థోమత పెరిగేలా తమ ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. ఎత్తివేయగలిగే కేసులు ఉంటే ప్రభుత్వం సానుకూలంగా ఉందని.. కేసులు ఎత్తివేయడానికి ఉన్న అవకాశాలను పరిశీలిస్తామని.. చట్టపరంగా ఎత్తివేయడానికి ఉన్న కేసులను ఎత్తివేస్తామని హామీ ఇచ్చారు. తీవ్రమైన నేరాలు ఉంటే ప్రభుత్వాలు ఎత్తివేస్తే కోర్టులు ఊరుకోవని అన్నారు.