
టీం ఇండియా టి-20 ప్రపంచకప్ ఫైనల్ ఆడేందుకు సిద్ధమవుతోంది. ఆదివారం జరిగే ఫైనల్‌లో భారత్, న్యూజిలాండ్‌తో తలపడనుంది. అయితే ఈ మ్యాచ్‌కి ముందు జట్టుకు ఓ విషయం తలనొప్పిగా మారింది. అదే మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చకవర్తి పేలవ ప్రదర్శనే. ఇంగ్లండ్‌తో జరిగిన సెమీ ఫైనల్‌లో వరుణ్ 4 ఓవర్లలో కేవలం 1 వికెట్ మాత్రమే తీసి ఏకంగా 64 పరుగులు సమర్పించుకున్నాడు. ఈ నేపథ్యంలో టీం ఇండియా మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్.. వరుణ్ బౌలింగ్ గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు.
బౌలింగ్ విషయంలో ఇప్పటికే చాలాసార్లు ఒక మాట చెప్పానని అశ్విన్ అన్నాడు. తన యూట్యూబ్ ఛానల్‌లో అశ్విన్ మాట్లాడుతూ.. ‘‘వరుణ్ విషయంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు పెద్ద చర్చ. ప్రత్యర్థి బ్యాటర్లు అతడిని లక్ష్యంగా చేసుకొని ఎటాకింగ్ చేస్తున్నారా? లేదా వారికి ఛాన్స్ ఇస్తున్నాడా? ఇంగ్లండ్ బౌలర్ ఆదిల్ రషీద్ కూడా గూగ్లీలు వేస్తాడు. రషీద్‌ను మన బ్యాటర్లు బాగానే ఎదుర్కొన్నారు. కానీ, అతడు మరీ ఎక్కువగా పరుగులు ఇవ్వలేదు. కానీ, వరుణ్ విషయంలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. స్పీడ్ వేరియేషన్ చూపించాలి. ఇలాంటప్పుడే వరుణ్‌తో మేనేజ్‌మెంట్ మాట్లాడాలి. బ్యాటర్లు ఎటాకింగ్ చేయగానే అతడిలో విశ్వాసం సన్నగిల్లుతోంది. అయితే, ఎడమ చేతి వాటం బ్యాటర్లు క్రీజ్‌లో ఉన్నప్పుడు రౌండ్ ది వికెట్ నుంచి బౌలింగ్ చేయవద్దని చెప్పి చెప్పి నేను అలసిపోయా’’ అశ్విన్ వ్యాఖ్యానించాడు.