
హైదరాబాద్: అజ్ఞాతం వీడి 130 మంది మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలిసిపోతున్నారని డిజిపి శివధర్ రెడ్డి తెలిపారు. ఆయుధాలతో సహా 130 మంది మావోయిస్టులు లొంగిపోయారని అన్నారు. సిఎం రేవంత్ రెడ్డి, డిజిపి శివధర్ రెడ్డి సమక్షంలో 124 ఆయుధాలు మావోయిస్టులు అప్పగించారని, మావోయిస్టు అగ్రనేత అసలెవరీ తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్ జీకి చెందిన పిఎల్ జిఎ కమిటీ మొత్తం సరెండర్ అయ్యారని తెలియజేశారు. ఈ సందర్భంగా డిజిపి శివధర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. లొంగిపోయిన వారిలో 125 మంది ఛత్తీస్ గఢ్ వాళ్లు, నలుగురు తెలంగాణ వాళ్లు, వారిలో ఒకరు ఆంధ్రప్రదేశ్ కు చెందినవారని అన్నారు. గత నాలుగైదు నెలల్లోనే సుమారు 250 మంది మావోయిస్టులు లొంగిపోయారని, లొంగిపోయిన వాళ్లలో ముగ్గురు స్టేట్ కమిటీ స్థాయి ఉన్నవాళ్లు, వాళ్లలో ఒకరు రీజనల్ కమిటీ స్థాయి ఉన్నవాళ్లు,10 డివిజన్ కమిటీ స్థాయి ఉన్నవాళ్లు, 46 మంది ఏరియా కమిటీ సభ్యులు, 76 మంది దళసభ్యులు, లొంగిపోయిన వారిలో చాలా మంది సెంట్రల్ కమిటీ వద్ద స్టాఫ్ గా పనిచేసిన వాళ్లు ఉన్నారని అన్నారు. ఇవాళ్టి లొంగుబాటుతో తెలంగాణ స్టేట్ కమిటీ పూర్తిగా అంతర్ధానం అయ్యిందని, ఇప్పుడు తెలంగాణ స్టేట్ కమిటీ అనేది ఇక లేదని డిజిపి శివధర్ రెడ్డి పేర్కొన్నారు.