
హైదరాబాద్: బిఆర్ఎస్ హయాంలో దేశంలోనే అత్యధిక పంటలు పండించింది తెలంగాణ అని మాజీ మంత్రి హరీష్ రావు కొనియాడారు. కోరుట్ల, చొప్పదండి ప్రాంతాలకు సాగునీళ్లొచ్చేలా చేసింది బిఆర్ఎస్ ప్రభుత్వం అని ..వరద కాల్వను రిజర్వాయర్ లా మార్చడంతో సాగునీళ్లు పారుతున్నాయని అన్నారు. కరీంనగర్ జిల్లాలో హరీష్ రావు పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..కాళేశ్వరం కూలిందని సిఎం రేవంత్ రెడ్డి చిల్లర మాటలు మాట్లాడుతున్నాడని, కాళేశ్వరం లేకుండానే దేశంలోనే అత్యధిక పంటలు పండించామని అబద్ధాలు ఆడుతున్నారని విమర్శించారు. రైతులపై కక్షగట్టి సాగునీళ్లు రేవంత్ సర్కార్ ఇవ్వడం లేదని, మెదక్, సిరిసిల్ల, కరీనగర్ జిల్లాల్లో పంటలు పండుతున్నది కాళేశ్వరం నీటితో కాదా? అని హరీష్ రావు ప్రశ్నించారు. అద్భుతంగా కరీంనగర్ ను తీర్చిదిద్దింది బిఆర్ఎస్ ప్రభుత్వమేనని, లక్ష్మి పంప్ హౌస్ మోటార్లు ఆన్ చేయడంతో వరద కాల్వల ద్వారా నీళ్లు వచ్చాయని, ఎల్లంపల్లి ప్రాజెక్టుకు నిధులు ఇచ్చి పూర్తి చేసింది బిఆర్ఎస్ ప్రభుత్వమని పేర్కొన్నారు.
మిడ్ మానేరు పనులు 90శాతం పూర్తి చేసిందని, తూములు, రెండు వైపులా కాల్వల ద్వారా నీళ్లిచ్చిందని చెప్పారు. సిరిసిల్ల, వేములవాడ ప్రాంత ప్రజలకు సాగు.. తాగునీళ్లిచ్చిందని, గౌరెల్లి ప్రాజెక్టును 95 శాతం పూర్తి చేసిందని అన్నారు. ఉన్న ప్రాజెక్టుల నీళ్లు పారించని తెలివిలేని ప్రభుత్వం కాంగ్రెస్ అని.. కాల్వల్లో పూడిక తీయడం లేదు.. దీంతో నీళ్లురాని పరిస్థితి అని ఎద్దేవా చేశారు. కాళేశ్వరం మోటార్లు గతవారం రోజులు నడిస్తేనే కదా ఇక్కడి దాకా నీళ్లు వచ్చింది అని..మిడ్ మానేరు, ఎల్లంపల్లి ద్వారా నడిచే మోటార్లు కాళేశ్వరంవేనని అన్నారు. కాళేశ్వరం కూలిపోతే మల్లన్న సాగర్ నుంచి 20 టిఎంసిలు ఎలా తీసుకెళ్తారని ప్రశ్నించారు. కాళేశ్వరంలోని రిజర్వాయర్ల నుంచి సాగు, తాగునీళ్లు అందుతున్నాయని, రైతుల పంటలు పండుతున్నది నిజం.. ప్రజలకు తాగునీళ్లు అందుతున్నది నిజం అని ..కరీంనగర్ తాగునీళ్లు అందున్నది బిఆర్ఎస్ ప్రభుత్వం కృపేనని హరీష్ రావు హరీష్ రావు స్పష్టం చేశారు.