
సోషల్ మీడియా వినియోగంపై ఎపి ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో 13 ఏళ్ల లోపు పిల్లలు సోషల్ మీడియా వాడకుండా నిషేధం విధిస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. శుక్రవారం అసెంబ్లీలో ద్రవ్య వినిమయ బిల్లుపై మాట్లాడుతూ ఆయన ఈ కీలక విషయాన్ని వెల్లడించారు. రాబోయే 90 రోజుల్లోగా దీనికి సంబంధించి కఠినమైన చర్యలు తీసుకుంటామని చంద్రబాబు స్పష్టం చేశారు. ఇక 13 నుంచి 16 ఏళ్ల వయసున్న పిల్లల విషయంలో ఎటువంటి ఆంక్షలు విధించాలనే దానిపై ప్రభుత్వం చర్చి స్తోందని చంద్రబాబు వెల్లడించారు. దీనిపై అందరితో చర్చించి, ఏకాభిప్రాయం కుదిరిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. యాదృచ్ఛికంగా, కర్ణాటకలోనూ 16 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియాను నిషేధిస్తున్నట్లు ఆ రాష్ట్ర సిఎం సిద్ధరామయ్య ఇదే రోజు ప్రకటించడం గమనార్హం. పాఠశాల విద్యార్థులను సోషల్ మీడియాకు దూరంగా ఉంచేలా చట్టం తెచ్చే ఆలోచనలో ప్రభుత్వం ఉందని గత నెలలో హోంమంత్రి వంగలపూడి అనిత అసెంబ్లీకి తెలిపారు.
దీనిపై మంత్రివర్గ ఉపసంఘం ఇప్పటికే రెండుసార్లు భేటీ అయ్యి, తమిళనాడు, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో అమలవుతున్న విధానాలను పరిశీలించింది. సోషల్ మీడియా మితిమీరిన వినియోగం వల్ల పిల్లల ఏకాగ్రత దెబ్బతింటోందని, వారి చదువుపై తీవ్ర ప్రభావం పడుతోందని ఐటి మంత్రి నారా లోకేష్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమస్య పరిష్కారానికి అంతర్జాతీయ విధానాలను పరిశీలిం చేందుకు మెటా, గూగుల్, ఎక్స్ వంటి దిగ్గజ సంస్థలతో చర్చలు జరపనున్నట్లు లోకేష్ గతంలోనే తెలిపారు. మహిళలు, పిల్లలకు సోషల్ మీడి యాను సురక్షితమైన వేదికగా మార్చడమే తమ లక్ష్యమన్నారు. మరోవైపు, వయసు ఆధారంగా సోషల్ మీడియా నియంత్రణపై జాతీయ విధా నం తేవాలని కోరుతూ టిడిపి ఎంపి లావు శ్రీకృష్ణదేవరాయలు ఇటీవల కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్‌కు వినతిపత్రం సమర్పించారు.