Reading Time: < 1 minute

టి-20 ప్రపంచకప్‌ తుది దశకు చేరుకుంది. ఆదివారం జరిగే ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌, భారత్‌తో తలపడనుంది. ఈ నేపథ్యంలో మ్యాచ్‌ల నిర్వాహకులపై టీం ఇండియా క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మ్యాచ్ జరుగుతున్న సమయంలో మైదానంలో న్యూసెన్స్ క్రియేట్ చేయడాన్ని ఆయన తప్పుబట్టారు.

అసలు జరిగింది ఏంటంటే.. టి-20 ప్రపంచకప్ సెమీ-ఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై భారత్ విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌ ఉత్కంఠగా ఉన్న సమయంలో జస్ప్రీత్ బుమ్రా అద్భుతమైన బౌలింగ్ చేసి ఇంగ్లండ్ బ్యాటర్ల పరుగులు చేయకుండా కట్టడి చేశాడు. ఇన్నింగ్స్ 16వ ఓవర్ సమయంలో ఇంగ్లండ్ బ్యాటర్ బెతెల్ స్ట్రైకింగ్‌లో ఉన్నాడు. మూడో బంతి వేసేందుకు బుమ్రా సిద్ధమవుతున్న సమయంలో అతన్ని ఉత్సాహపరచడానికి మైదానంలో ‘‘బూమ్ బూమ్ బుమ్రా’’ అంటూ డిజె సౌండ్స్ మోత మోగింది. దీనిపైనే సునీల్ గావస్కర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇలా చేయడం వల్ల బౌలర్ ఏకాగ్రత దెబ్బ తినే ప్రమాదం ఉందని వ్యాఖ్యానించారు.

‘‘మ్యాచ్ చూసేందుకు వచ్చి బూమ్ బూమ్ బుమ్రా అంటూ డిజెలను ఏర్పాటు చేశారు. అయితే ఇది ఆటకు మంచిది కాదని నా అభిప్రాయం. ఓవర్ మధ్యలో ప్లే చేయడం సరికాదు. ఇది వరల్డ్ కప్, కాబట్టి ఇలాంటి సమయంలో ఆటగాళ్ల ఏకాగ్రత దెబ్బ తింటుంది. ఇంతకు ముందు విండీస్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ లేజర్ షో ఏర్పాటు చేశారు. రెండున్నర నిమిషాల వ్యవధి ఉండే ఆ షో వల్ల ప్లేయర్ల కళ్లపై ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. ఇలా చేయడం బ్యాటర్లకు చాలా ఇబ్బంది. జిగేల్‌మనే టలైటింగ్ చూసిన తర్వాత.. కాసేపు చుట్టూ చీకటిగా అనిపిస్తుంటుంది. ఇలాంటి ఎంటర్‌టైన్‌మెంట్ కావాలంటే.. ఐపిఎల్ ఉంది. అందులోనూ నాకౌట్ స్టేజిలో వద్దు. లీగ్ స్టేజ్‌లో ఇలాంటి ఏర్పాటు చేసుకోండి’’ అని గవాస్కర్ పేర్కొన్నారు.