Reading Time: < 1 minute

ట్రైన్ లో ప్యాసింజర్కు ఎమర్జెన్సీ వైద్యం.. సకాలంలో స్పందించి ప్రాణాలు కాపాడిన 108 సిబ్బంది

Caption of Image.

వరంగల్, వెలుగు: హైదరాబాద్​ నుంచి ట్రైన్‌‌లో కలకత్తా వెళుతున్న మహిళకు ఎమర్జెన్సీ చికిత్స అవసరమైన సమయంలో 108 అంబులెన్స్ సిబ్బంది సకాలంలో స్పందించి ప్రాణాలు కాపాడారు. కలకత్తాకు చెందిన పింకీ సాహ(31) అనే మహిళ భర్త సుమన్ సాహతో కలిసి ఇటీవల హైదరాబాద్‌‌కు వచ్చింది. బుధవారం ఉదయం హౌరా ఎక్స్​ప్రెస్​ ట్రైన్​లో భర్త, సోదరుడితో కలిసి తిరిగి కలకత్తాకు బయల్దేరింది.

జనగామ దాటిన తర్వాత ఆమెకు తీవ్రమైన కడుపునొప్పితో పాటు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలిగింది. కుటుంబ సభ్యులు వెంటనే కాజీపేట రైల్వే అధికారులకు సమాచారం అందించగా, వారు 108 సిబ్బందిని అప్రమత్తం చేశారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో 108 టీమ్ సభ్యుడు చైతన్య, కాజీపేట అంబులెన్స్ పైలట్ కుమారస్వామి తక్షణమే కాజీపేట రైల్వే స్టేషన్​కు చేరుకున్నారు. పింకీని ప్లాట్‌‌ఫాం నుంచి వీల్‌‌చైర్ సాయంతో అంబులెన్స్​కు తరలించారు. అనంతరం సుమారు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎంజీఎంకు తీసుకెళ్లారు. డాక్టర్ మౌనిక ఆదేశాల మేరకు ప్రయాణంలోనే హైఫ్లో ఆక్సిజన్ అందిస్తూ అత్యవసర చికిత్స కల్పించారు. దవాఖానలో డాక్టర్లు వెంటనే ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ అందించడంతో పింకీ ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడింది. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు ఎంజీఎం డాక్టర్లు  చెప్పారు.
 

©️ VIL Media Pvt Ltd.