
సమాజంలో ప్రతి రంగంలో రోజురోజుకూ ఎన్నో మార్పులు చోటుచేసుకుని నవశకానికి నాంది పలుకుతుంటే, ఒక గీతకార్మికుల బతుకుల్లో మాత్రం మార్పు లేకపోవడం బాధాకరం. పాలకులు, ప్రభుత్వా లు మారినా గీతకార్మికుల జీవనవిధానంలో విలక్షణమైన మార్పులు రావడం లేదు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకు పోరాటమే భవితగా ముందుకు సాగుతున్న ఈ సామాజిక వర్గానికి భరోసానిచ్చే వారేవరు? కుటుంబ బాధ్యతలే పరమావధిగా బాధలు ఎన్ని ఉన్నా భరిస్తూ కులవృత్తిని నమ్ముకున్న ఈ కష్టజీవులను ఆదరించే దిక్కేవరు? తరాలు మారుతున్న గీతకార్మికుల తలరాతలు మారడం లేదనడానికి ఎన్నో సంఘటనలు మన ముందు కదలాడుతున్నాయి. రెక్కాడితే కానీ డొక్కాడని వీరి జీవితాలు ప్రతిక్షణం కత్తిమీద సాము లాంటివి. ఆత్మగౌరవం తోడుగా ధైర్యమే దోస్తీగా కులవృత్తి జీవన భృతిగా సాగుతున్న వీరి బతుకులకు రక్షణ కరువైందని చెప్పవచ్చు. అధికారుల, పాలకుల అండతో అగ్రవర్ణాల ఆగడాలతో అమాయకపు గీత కార్మికుల జీవితాలను ఛిన్నభిన్నం చేస్తున్న వారిపై చర్యలు తీసుకునే నాథుడే లేడు. వివిధ కార్యక్రమాల పేర్లతో, వృత్తి పరిరక్షణ ప్రచారం పేరుతో తాటి, ఈతవనాలు పెంచుతామని చెప్తూనే వాటి పర్యవేక్షణ బాధ్యతను గాలికి వదిలేసి గీత కార్మికుల పట్ల పాలకులు నిర్లక్ష్యపు వైఖరిని ప్రదర్శిస్తున్నారు.
పంటభూముల్లో ఉన్న తాటి, ఈతచెట్లను కొంత రుసుం చెల్లించి తొలగించుకోవచ్చనే నిబంధన గౌడన్న జీవనోపాధికి బీటలు పారేలా చేస్తున్నది. ప్రమాదవశాత్తు తాటిపైనుండి పడి దుర్మరణం చెందిన గీత కార్మికుల ఎక్స్‌గ్రేషియా మంజూరు విషయంలో కూడా నిమ్మకునిరెత్తినట్లు ఉండటమే చేస్తుంది. సంవత్సరాలు గడుస్తున్నా కుటుంబంలో ఎవరి తోడు లేక బాధ్యతమైన వ్యక్తి లేక ఎంతో మంది గీత కార్మికుల కుటుంబాలకు ఇప్పటివరకు కూడా ఎక్స్‌గ్రేషియా రాకపోవడం దురదృష్టకరం. ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న ఈత, తాటి వనాలకు రక్షణ దిక్కులేదు. కానీ కొత్తవనాల పెంపు కార్యక్రమాలు రూపొందించడం హాస్యాస్పదం అని చెప్పవచ్చు. దాదాపు నాలుగు సంవత్సరాల క్రితం ఎక్స్‌గ్రేషియా మంజూరు చేస్తే ఇప్పటివరకు బాధిత గీత కార్మికుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ఇచ్చిన పాపాన పోలేదు. నిర్లక్ష్యపు నీడలు వెంటాడుతూ నిరుపేద గౌడన్నల జీవితాలు అగమ్యగోచరంగా మారినా ప్రభుత్వాల మనసు మాత్రం మారడం లేదు. బడుగు బలహీన వర్గాల్లో అధిక జనాభా కలిగిన గీత కార్మికుల సంక్షేమానికి ఒక ప్రత్యేకమైన కార్యాచరణ రూపొందించి గౌడ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. గీతకార్మికుల కుటుంబంలో ఉన్న యువతకు ఉపాధి కల్పనకై తాడి టాపర్ బోర్డు ఏర్పాటు చేసి తాటి ఈత సంబంధిత పదార్థాల ఉత్పత్తిని చేపట్టాలి. ప్రకృతి సిద్ధంగా, సహజంగా లభించే కల్లును మార్కెట్‌లో అందుబాటులో ఉంచి వాణిజ్య పరిశ్రమగా అభివృద్ధి చెందేలా చర్యలు తీసుకోవాలి. తాటి ఈత ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేసి గీత కార్మికుల జీవనోపాధికి పటిష్టమైన కార్యక్రమాలు, పథకాలు రూపొందించాలి. వృద్ధులైన గీత కార్మికులకు తగిన మొత్తంలో పింఛన్లు ఇవ్వాలి. తాటి ఈత వనాల పెంపకానికి సంబంధించి మరుగుజ్జు రకానికి చెందిన రకాలపై దృష్టి సారించాలి. ప్రమాదవశాత్తు తాటి చెట్టుపై పడి మరణించే పరిస్థితిని రూపుమాపడానికి నిర్ణయాత్మక ఆలోచనతో తాడిచెట్టు ఎక్కే యంత్రాలను ప్రభుత్వం తీసుకురావడం జరిగింది.
కానీ వాటిని పూర్తిస్థాయిలో రాష్ట్రమొత్తంలో ఉన్న గీత కార్మికులకు అందేలా చర్యలు తీసుకోవాలి. పూర్తిస్థాయిలో అన్ని గ్రామాలకు సేఫ్టీ మోకులను అందించేలా ప్రణాళికలు చేసి నిర్మాణాత్మకమైన శిక్షణ ఏర్పాటు చేయాలి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి టివిఎస్ మోపెడ్లు కొనుగోలు చేసి ఇవ్వాలి. కుటుంబాలు గడవడం కష్టంగా మారి ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతూ కులవృత్తినే నమ్ముకుని జీవిస్తూన్న, ఎండిన తాటి, ఈత వనాలతో కల్లు రాక నానాఇబ్బందులు పడుతున్నా గీత కార్మికులకు గౌడ స్వయం ఉపాధి సంఘాలు ఏర్పాటుచేసి వారికి ఉపాధి కల్పించాలి.బెల్టుషాపుల దెబ్బకు కల్లు అమ్ముడుపోక ఆర్థికంగా ఇబ్బందులుపడుతున్నా పరిస్థితులను పాలకులు ఆలోచన చేయాలి. ఎన్నోఏళ్లుగా గీతవృత్తినే నమ్ముకుని జీవిస్తున్నా, గీత కార్మికులు చస్తే తప్ప బతకడానికి పథకాలు ఏమీ లేవు. తాటి చెట్లు ఎక్కి కల్లు గీసుకునే గీత కార్మికులు ప్రమాదవశాత్తు పడి మరణిస్తే, శాశ్వత అంగ వైకల్యం పొందిన వారికి ప్రభుత్వం రూ. 5లక్షల బీమా నుండి 10 లక్షల వరకు వర్తింపజేయాలి. గీతవృత్తిని అభివృద్ధి చేసేందుకు సబ్సిడీ పథకాలు రూపొందించడంలో ప్రభుత్వం గౌడ కులస్థులను విస్మరించే పరిస్థితి మారాలి.
వంశీకృష్ణ గౌడ్ బండి, 95508 37962