
స్వాతంత్య్రం వచ్చినప్పటినుండే అమెరికాతో భారత్‌కు ఏనాడూ సన్నిహిత సంబంధాలు ఉన్నాయని చెప్పలేం. భారత్ రష్యాకు దగ్గరవడంతో కేవలం చైనాను కట్టడిచేసేందుకు ఒక పావుగా భారత్‌ను ఉపయోగించుకొనే ప్రయత్నం తప్ప భారతదేశ ప్రయోజనాలపట్ల ఆ దేశానికి ఏనాడూ ఆసక్తి లేదు. పైగా, వ్యూహాత్మక, రక్షణ అవసరాలరీత్యా పాకిస్థాన్‌తో అంటకాగుతూ వస్తుంది. మొదటిసారిగా, అణుపరీక్షల అనంతరం ఆంక్షలను సైతం లెక్కచేయకుండా కార్గిల్ యుద్ధం సందర్భంగా అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరించి వాజపేయి ప్రభుత్వం అంతర్జాతీయంగా పాకిస్థాన్‌ను ఒంటరి చేయగలిగింది. అమెరికాతో వ్యూహాత్మక సంబంధాల పెంచుకునేందుకు మార్గం ఏర్పచింది. అయితే, మోడీ హయాంలో ఆ ప్రయత్నాలకు గండిపడిందా? అనే అనుమానం కలుగుతుంది. 2025లో జరిగిన పరిణామాలే అందుకు నిదర్శనం. దౌత్యపరంగా, వాణిజ్య ఒప్పందం విషయంలో ఓ విధంగా భారత్‌ను వణికించిందని చెప్పవచ్చు.
ఒక విధంగా గతంలో మరే ప్రధాని ప్రయత్నించని విధంగా అమెరికా అధ్యక్షుడిగా వ్యక్తిగతంగా సాన్నిహిత్యం పెంచుకొనే ప్రయత్నం మోడీ చేశారు. ఆయనకు ‘అత్యంత సన్నిహితుడు’గా ప్రచారం పొందిన డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టడంతో ఒక విధంగా ఆశావాదంగా ప్రారంభమైన ఈ సంవత్సరం చివరకు ట్రంప్ పేరు చెబితేనే భారతీయులు భయపడే స్థాయికి తీసుకెళ్లింది. ‘కొందరి మాదిరిగా కాకుండా, ట్రంప్ నేతృత్వంలోని అమెరికా పరిపాలన గురించి మేము భయపడటం లేదు. ఇద్దరి మధ్య ఒకే విధమైన ఆసక్తులు అనేకం ఉన్నాయి’ అంటూ విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ గత జనవరిలో ప్రకటించారు. అయితే, స్వయంగా జైశంకర్ అమెరికా పర్యటనకు వెళ్లి, ఐదు రోజులపాటు ప్రయత్నం చేసినా ట్రంప్ ప్రమాణస్వీకారంకు హాజరయ్యేందుకు ప్రధాని మోడీకి ఆహ్వానం సంపాదింపలేకపోయారు. అధికారంలోకి రాగానే ట్రంప్ ఏకపక్షంగా భారతీయ వస్తువులపై 25% సుంకాలు విధించడం ద్వారా భారతీయులను దిగ్భ్రాంతికి గురిచేశారు. మరి కొన్ని రోజులకే వాటిని 50 శాతంకు పెంచారు. ట్రంప్ సృష్టించిన తుఫాను మన తీరాలను తాకుతుందని మన విదేశాంగ కార్యాలయం ఏమాత్రం ఊహింపలేకపోయింది. ముఖ్యంగా పహల్గామ్ ఉగ్రవాదదాడి తర్వాత ట్రంప్ అనుసరిస్తున్న విధానాలు భారతీయులను కలవరంకు గురిచేస్తున్నాయి. ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్ రూపంలో కొత్తరూపం దాల్చిన మన పాత ప్రత్యర్థి పాకిస్తాన్‌ను ట్రంప్ దగ్గరకు తీస్తున్న తీరు నమ్మశక్యంగా లేకుండాపోయింది. పహల్గామ్‌కు భారతదేశం సైనికంగా ప్రతీకారం తీర్చుకోకముందే, మునీర్ ట్రంప్ కుటుంబ సంస్థతో భారీ లాభదాయకమైన క్రిప్టోకరెన్సీ ఒప్పందాన్ని తొందరగా కుదుర్చుకున్నాడు. దానితో ట్రంప్ వ్యాపార భాగస్వామి జాచరీ విట్‌కాఫ్ పాకిస్తాన్‌కు ఎగిరి గంతేసాడు.
ఆ తరువాత ట్రంప్ మునీర్‌ను గౌరవ అతిథిగా వైట్ హౌస్ లో స్వాగతించడమే కాకూండా, తన గడ్డపై భారతదేశాన్ని నాశనం చేస్తున్నానని గొప్పలు చెప్పుకున్నప్పటికీ, పాకిస్తాన్‌ను చెత్త ట్రక్కుతో, భారత దేశాన్ని మెరిసే మెర్సిడెస్‌తో పోల్చినప్పుడు కూడా అమెరికా నిరసన వ్యక్తం చేయలేదు. ఇండో -పాకిస్తాన్ వివాదాన్ని ముగించినందుకు నోబెల్ శాంతి బహుమతికి ట్రంప్‌ను నామినేట్ చేస్తున్నట్లు ప్రకటించడం ద్వారా ఆయన హృదయాన్ని మునీర్ నిశ్చయంగా గెలుచుకున్నారు. పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా భారత దౌత్యపరమైన ప్రతిఘటన మీడియా సమావేశాలకు, ప్రకటనలకు మాత్రమే పరిమితమైపోయింది. అందుకు దీటుగా వ్యూహాత్మకంగా తిప్పికొట్టే ప్రయత్నం భారత్ చేయలేకపోయింది. అమెరికాలో ప్రధాని మోడీకి సన్నిహితంగా ఉన్న అనేకమంది బిలియనీర్లు, రాజకీయ-వ్యాపార ప్రముఖులు ఏవ్వరిని ఉపయోగించి ట్రంప్‌ను ప్రభావితం చేసే ప్రయత్నాలు జరగనేలేదు. మన రాయబారులు, దౌత్యప్రతినిధులు సైతం ట్రంప్ అంతర్గత వలయంలోకి ప్రవేశింపలేకపోతున్నారు. అందుకు విరుద్ధంగా, వైట్ హౌస్‌లో పాకిస్తాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ సహచరుడు అరుదైన-భూమి ఖనిజాల పళ్ళెం పట్టుకుని వెళ్ళాడు. వాటిని అమెరికాకు అప్పగించే ప్రతిపాదన చేయడం ద్వారా తిరుగుబాటు ఎదుర్కొంటున్న బలూచిస్తాన్ ప్రాంతంకు అమెరికా సహాయం అందకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు.
ఒకప్పుడు అమెరికాలో మన జాతీయ ప్రయోజనాలు కాపాడటంలో క్రియాశీలంగా వ్యవహరించిన ఎన్‌ఆర్‌ఐ ప్రముఖులు ట్రంప్ వలసదారులు లక్ష్యంగా చేసుకోవడంలో ఇప్పుడు మౌనం వహిస్తున్నారు. చివరకు వారు భారత దేశప్రయోజనాల గురించి మాట్లాడటమే కాకూండా, సెలవులలో అమెరికాలో విహారయాత్రకు వెళ్లినా తమ విషయాలను ఎక్కడ రద్దు చేస్తారో అనే భయంతో ఇల్లుదాటి బైటకు రావడం లేదు. అటువంటి అవకాశవాదులు భారత ప్రభుత్వం భుజానవేసుకొని, ప్రవాస భారతీయుల సమ్మేళనాలు అంటూ రాజమర్యాదలు చేస్తుండటం సిగ్గుచేటుగా భావించాలి.
ఆపరేషన్ సిందూర సమయంలో రెండు దేశాల మధ్య అణు యుద్ధాన్ని తానే ఆపివేసానని ట్రంప్ ఇప్పటికీ గొప్పలు చెప్పుకొంటున్నారు. ఈ విషయంలో ఆయన ‘అహంకారం’ దెబ్బతినకుండా భారత్ తెలివిగా వ్యవహరించి ఉంటే ఇన్ని సమస్యలు ఎదురయ్యేవి కావని దౌత్యా నిపుణులు భావిస్తున్నారు. రష్యాపై అమెరికా ఆంక్షలను బేతఖార్ చేస్తూ భారత్ కన్నా చైనా, ఐరోపా దేశాలు ఎక్కువగా దిగుమతులు చేసుకొంటున్నా మాట్లాడని ట్రంప్ కేవలం చమురు చౌకగా వస్తుందని కొంటున్న భారత్‌ను లక్ష్యంగా చేసుకొని, సుంకాలను 50 శాతంకు పెంచేందుకు ఈ ‘అహంకారమే’ కారణం అని దౌత్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఈ సమయంలో పాకిస్థాన్‌తో సంప్రదింపులు జరిపిన అమెరికా ఆ దేశాన్ని మందలించి, కాల్పుల విరమణకన్నా గత్యంతరం లేకుండా చేసిందని తెలివిగా చెప్పినా మరో విధంగా ఉండేదా? మన జాతీయ సార్వభౌమత్వాన్ని రాజీపడకుండా చాకచక్యంగా వ్యవహరించే ప్రయత్నం చేయలేదు. అందుకు స్వదేశంలో రాజకీయ ప్రయోజనాలే అడ్డు వచ్చాయా? కొత్త బహుళ ధ్రువ ప్రపంచంలో, భారతదేశం ఒక అసాధారణమైన పాత్ర వహించాల్సి ఉంది. స్నేహపూర్వక సంబంధాలు ఉన్నప్పటికీ, పాకిస్తాన్ ప్రధాన సైనిక సరఫరాదారుగా, మన సరిహద్దు భూభాగంపై శత్రుహక్కుదారుగా చైనా ఒక ప్రధాన ముప్పుగా మిగిలిపోయింది. సుంకాల ఒప్పందంపై అమెరికాతో ప్రతిష్టంభన నెలకొన్నప్పటికీ గత నవంబర్‌లో అన్నికాలాలలోనూ అత్యధిక ఎగుమతులు నెలకొనడంతోపాటు, 2025లో ఆకట్టుకునే ఆర్థిక వృద్ధి నమోదు చేయడం ద్వారా ఈ ప్రతిబంధకాలు తట్టుకోగలననే సంకేతం భారత్ ఇవ్వగలిగింది. అమెరికా, కెనడా వంటి అనేక దేశాలలో భారతీయ విద్యార్థులు, ఉద్యోగం కోసం వెళ్ళినవారు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. చివరకు రష్యా, ఉక్రెయిన్ సైన్యాలలో సైతం మోతపూరితంగా చేరి చావుకు తెచ్చుకుంటున్నారు. అయినా, భారత ప్రభుత్వం ప్రేక్షక పాత్ర వహించడం తప్ప ఏమీ చేయలేకపోతున్నది. అన్ని పొరుగు దేశాలతో భారత్ సంబంధాలు ఆందోళనకరంగానే ఉన్నాయి.
ఆయా దేశాలలో భారత్ వ్యతిరేకశక్తులు విజృంభిస్తూ ఉండటం, మరోవంక చైనా, పాకిస్థాన్ ప్రాబల్యం వారిపై పెరుగుతూ ఉండటం తీవ్రంగా పరిగణించాల్సిందే. దౌత్యవిధానాలను స్వదేశీ రాజకీయ ప్రయోజనాలతో ముడిపెడుతూ వస్తుండడంతో భారత్ అంతర్జాతీయంగా తీవ్రమైన ఒత్తిడులను ఎదుర్కొంటుందని గుర్తెరగాలి. స్వదేశీ రాజకీయ ప్రయోజనాలకు పరిమితం కాకుండా అంతర్జాతీయంగా భారత్ ప్రయోజనాలు, ప్రతిష్టలను దృష్టిలో ఉంచుకోవాలి. భారతదేశం బహుశా పాకిస్తాన్ నుండి ఈ సందర్భంగా ఒక పాఠం నేర్చుకోవచ్చు. మనం ఒక ప్రతిపాదన చేసామంటే దానిని అమలు చేస్తామని కాదని తెలుసుకోవాలి. తిరుగుబాటుతో నిండిన బలూచిస్తాన్‌లో చమురుకోసం లేదా శాంతియుతంగా ఖనిజాల కోసం తవ్వకాలు విజయవంతంగా చేపట్టడానికి అమెరికానుండి తీవ్రమైన ఒత్తిడులు ఎదురవుతున్నాయి. పాకిస్తాన్ ఆకర్షణీయమైన ఒప్పందాన్ని అందించడంలో చాతుర్యం, సాహసోపేతత్వాన్ని ప్రదర్శించింది. తద్వారా ఆ ప్రాంతంలో తిరుగుబాటుదారులు కట్టడి చేసేందుకు ఎత్తుగడవేసింది. అంతమాత్రం చేత సమీప భవిష్యత్‌లో ఆ ఒప్పందం అమలవుతుందని చెప్పలేం.
చలసాని నరేంద్ర
98495 69050