
మనతెలంగాణ/హైదరాబాద్ : శాసనసభలో ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలనుకుంటే, ప్రధాన ప్రతిపక్షమైన బిఆర్‌ఎస్ పార్టీకి కూడా అదే అవకాశం కల్పించాలని బిఆర్‌ఎస్ వ ర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ డిమాండ్ చేశారు. సభలోకి అడుగుపెట్టిన తర్వాత ముఖ్యమంత్రి, సాధారణ సభ్యుడు అనే తేడా ఉండదని, 120 మంది శాసనసభ్యులకు సమాన హక్కులు ఉంటాయని స్పష్టం చేశారు. తమకు కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌కు అవకాశం ఇవ్వాలని మాత్రమే కోరుతున్నామని అన్నారు. తాము ప్రధాన ప్రతిపక్షం అని, గత పదేళ్లలో తెలంగాణ వ్యవసాయా న్ని, సాగునీటిని ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్లామో సభలో వివరించేందుకు సిద్ధంగా ఉన్నామ ని తెలిపారు. గతంలో 2016 మార్చి 31న కెసిఆర్ శాసనసభలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ దాన్ని బాయ్‌కాట్ చే సిందని, ఇది పార్లమెంటరీ సంప్రదాయాలకు విరుద్ధమని విమర్శించిందని గుర్తు చేశారు. అప్పు డు తప్పు అన్న కాంగ్రెస్ పార్టీకి, ఇప్పుడు అదే పద్ధతి సరైనదిగా ఎలా మారింది..? అని ప్రశ్నించారు. ఈ అంశంపై స్పీకర్‌కు తరువాయి 9లో
లేఖ కూడా ఇచ్చామని, వారు ఏ నిర్ణయం తీసుకుంటారో వేచి చూస్తామని పేర్కొన్నారు.
తెలంగాణ భవన్‌లో గురువారం కెటిఆర్ మీడియాతో మాట్లాడారు. నదీ జలాలపై, సాగునీటి అంశాలపై కనీస అవగాహన లేని ముఖ్యమంత్రి తమకు శాసనసభలో ఉపన్యాసాలు ఇవ్వబోతున్నారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. స్వాతంత్య్ర దినోత్సవం నాడు భాక్రా నంగల్ ప్రాజెక్ట్‌ను తెలంగాణలో ఉన్నట్లు ముఖ్యమంత్రి చెప్పారని, అసలు ఆ ప్రాజెక్ట్ హిమాచల్ ప్రదేశ్‌లో ఉందన్న విషయం కూడా తెలియని స్థితిలో ఉన్నారని ఎద్దేవా చేశారు. దేవాదుల ప్రాజెక్ట్ ఏ నదీ బేసిన్‌లో ఉందో కూడా తెలియని ముఖ్యమంత్రితో గోదావరి -కృష్ణా జలాలపై చర్చ చేయాలా..? అని ప్రశ్నించారు. శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ సొరంగం కూలి ఎనిమిది మంది కార్మికులు మరణించిన ఘటనలో ఇప్పటివరకు వారి మృతదేహాలను కూడా వెలికి తీయలేని అసమర్థ ప్రభుత్వం ఇది అని మండిపడ్డారు. సుంకిశాల ప్రాజెక్ట్ పూర్తిగా కూలిపోయినా, ఇప్పటివరకు సరైన సమాధానం చెప్పలేని దుస్థితి ఉందన్నారు. ఆ ఘటనకు బాధ్యులైన ఇంజనీరింగ్ సంస్థను బ్లాక్‌లిస్ట్ చేయాలని హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డ్ సిఫార్సు చేసినప్పటికీ, ఆ సంస్థపై చర్యలు తీసుకోలేని స్థాయిలో ప్రభుత్వం చేతకానితనాన్ని ప్రదర్శిస్తోందని విమర్శించారు. వట్టెం పంప్ హౌస్ మునిగిపోతుంటే చేతులు కట్టుకుని చూస్తూ నిలిచిపోయిన ప్రభుత్వం ఇది అని పేర్కొన్నారు. తాము సిఎం దగ్గర ఏం నేర్చుకోవాలి..? అని అడిగారు.
చెక్‌డ్యాంలు ఎలా ఫెయిల్ చేయాలో నేర్పిస్తారా.. మేడిగడ్డ ఎలా పేల్చామో చెబుతారా..సుంకిశాల ఎలా కూల్చామో వివరిస్తారా.. వట్టెం పంప్ హౌస్ ఎలా ముంచామో చూపిస్తారా.. లేక కృష్ణా నదిలో తెలంగాణకు ఉన్న హక్కులన్నింటినీ కెఆర్‌ఎంబికి ఎలా ధారాదత్తం చేశారో పవర్ పాయింట్‌లో చూపిస్తారా…?అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం గత రెండేళ్లుగా పూర్తిగా పక్కన పెట్టిందని ఆరోపించారు. ముఖ్యమంత్రి తరచూ పండబెట్టి తొక్కుతాం అంటారని, నిజంగానే ఆ పథకాన్ని పండుకోబెట్టి, తెలంగాణ రైతాంగాన్ని -ముఖ్యంగా పాలమూరు రైతాంగాన్ని తొక్కుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.రెండు సంవత్సరాల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క ఎకరానికైనా అదనంగా సాగునీరు అందించిందా.. ఒక్క చెరువును బాగు చేసిందా.. ఒక్క కాలువను మరమ్మత్తు చేసిందా..? అని ప్రశ్నించారు. పదేళ్ల బిఆర్‌ఎస్ పాలనలో సాగునీటి విస్తరణ ద్వారా తెలంగాణ వ్యవసాయాన్ని చారిత్రాత్మకంగా ముందుకు తీసుకెళ్లామని, ఆ నిజాలను శాసనసభలో వివరించేందుకు బిఆర్‌ఎస్ పూర్తిగా సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యాన్ని గౌరవించే ప్రభుత్వం అయితే, ప్రధాన ప్రతిపక్షానికి సమాన అవకాశం ఇవ్వాల్సిందేనని కెటిఆర్ డిమాండ్ చేశారు.