
మావోయిస్టు దళంలోని మరో అగ్రనేత బర్సెదేవా అలియాస్ సుక్కాతో పాటు 15మంది మావోయిస్టులు తెలం గాణ పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. ఇటీవల పోలీసుల ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన మావోయిస్టు అగ్రనేత హిడ్మాతో కలిసి బర్సెదేవా సుమారు 15 ఏళ్ల పాటు సుదీర్ఘంగా పనిచేసినట్లు తెలుస్తోంది. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీలో కమాండెంట్‌గా పనిచేసిన బర్సెదేవా, అనేక కీలక మావోయిస్టు ఆపరేషన్లలో కీలక పాత్ర పోషించినట్లు, సిఆర్‌పిఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోయిన పలు దాడుల్లో బర్సెదేవా కీలక పాత్ర పోషించినట్లు తెలిసింది. భద్రతా బలగాలు చేపడుతున్న ‘ఆపరేషన్ కగార్’ పేరుతో సాగుతున్న వరుస ఎన్‌కౌం టర్లు, కఠిన చర్యల నేపథ్యంలోనే మావోయిస్టు పార్టీకి చెందిన పలువురు కీలక నేతలు ఇటీవల తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయిన సంగతి విదితమే. ప్రస్తుతం బర్సెదేవా తెలంగాణ పోలీసుల అదుపులో ఉన్నప్పటికీ, ఈ విషయంపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. ఒకటి రెండు రోజుల్లో పోలీసుల నుంచి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. బర్సెదేవాపై రూ.50 లక్షల రివార్డు ఉన్నట్లు పోలీసులు గతంలోనే ప్రకటించారు. ఇదిలా ఉండగా పోలీసుల అదుపులో ఉన్న మావోయిస్టులను కోర్టులో హాజరుపర్చాలని పౌర హక్కుల సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. హిడ్మా మరణం తర్వాత ఆ స్థానంలో మరో కీలక కమాండర్ కోసం అన్వేషణ సాగింది. కాగా, మావోయిస్టుల అగ్రనేత హిడ్మా స్థానంలో బర్సెదేవా నియమితుల య్యారని తెలిసింది.