
రాష్ట్రం చలిగుప్పిట్లో చిక్కుకుంది. ఎన్నడూలేని విధంగా గత నెల రోజుల నుంచి ఏజెన్సీ ప్రాంతాల్లో చలి తీవ్రత పెరిగిపోవడంతో ప్రజలు వణికిపోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదవుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో దట్టమైన పొంగమంచు కురియడంతో వాహనదారులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గత నెల రోజులుగా తీవ్రమయిన చలిగాలులో వణికిపోతున్న ప్రజలకు పొగమంచుతో మరిన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పొగమంచు మధ్యాహ్నాం వరకు ఉండటంతో ప్రజల రోజువారీ పనులకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. ఈ ప్రభావం ఎజెన్సీ ప్రాంతాల్లో ప్రధానంగా కనిపిస్తోంది. ఉమ్మడి మెదక్, రంగారెడ్డి, ఆదిలాబాద్ జిల్లాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయి. కోహిర్, సిర్పూర్ ప్రాంతాల్లో గత నెల రోజులుగా 5 నుంచి 6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతున్నట్లు అధికారులు తెలిపారు. ఆసిఫాబాద్, మంచిర్యాల, వరంగల్, హన్మకొండ, సిద్దిపేట, జనగాం, మెదక్, రంగారెడ్డి, కామారెడ్డి జిల్లాల్లో చలి తీవ్రత బాగా పెరిగిపోయింది. హైదరాబాద్ నగర శివారు ప్రాంతాల్లోనూ పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది.
అక్కడి ప్రాంతాల్లో 8 నుంచి 12 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గత నెల రోజులుగా సింగిల్ డిజిట్‌కే పరిమితమయిన ఉష్ణోగ్రతలు గురువారం కొంత ఉపశమనాన్ని ఇచ్చాయి. కాగా రాబోయే మూడు రోజులు రాష్ట్రంలో సాధారణ ఉష్ణోగ్రతలు స్థిరంగా ఉంటాయని, దీంతో చలి ప్రభావం తగ్గుతుందని వాతావరణ శాఖ వెల్లడించింది. అయితే పొగమంచు మాత్రం కొనసాగే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ సమయంలో ఇలాంటి పొగమంచు వాతావరణంలో మార్పులను సూచిస్తుందని వాతావరణ నిపుణులు తెలుపుతున్నారు. సాధారణంగా హిమాలయాలకు చేరువలో ఉండే ఉత్తరాది రాష్ట్రాల్లో కనిపించే ఇలాంటి పరిస్థితులు, దక్షిణాదిలో నెలకొనడం అరుదని నిపుణులు పేర్కొంటున్నారు. రానున్న మరికొన్ని రోజులు ఇదే పరిస్థితి కొనసాగుతుందని, తెల్లవారుజామున దట్టమైన పొగమంచు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ క్రమంలో వాహనాదారులు ప్రయాణ సమయంలో అప్రమత్తంగా ఉండాలని, తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.