
కీవ్ :రష్యా ఆక్రమిత ఖేర్సన్ ప్రాంతంలోని ఖోర్లీ గ్రామంలో గల హోటల్, కేఫ్‌పై మూడు డ్రోన్లు దాడి చేయడంతో 24 మంది ప్రాణాలు కోల్పోగా, 50 మందికి పైగా గాయపడ్డారు. అక్కడి ప్రజలు కొత్త సంవత్సరం వేడుకల్లో నిమగ్నమై ఉండగా బుధవారం రాత్రి శత్రుదేశం ఈ డ్రోన్లను ప్రయోగించిందని రష్యా ప్రభుత్వ అధికారులు వెల్లడించారు. వివిధ ప్రాంతాల్లో ఉక్రెయిన్ ప్రయోగించిన డ్రోన్లను గగనతల రక్షణ వ్యవస్థలు అడ్డుకున్నాయని తెలిపారు.
ఈ సంఘటనలతో భద్రతా కారణాల దృష్టా విమానాశ్రయాలను తాత్కాలికంగా మూసివేశామని చెప్పారు. దీనికి ఉక్రెయిన్ అధికారులు స్పందించడం లేదు. రష్యా అధ్యక్షుడు పుతిన్ వ్యక్తిగత నివాసంపై ఆదివారం రాత్రి, సోమవారం తెల్లవారు జామున డ్రోన్లతో ఉక్రెయిన్ దాడికి ప్రయత్నించిందని రష్యా వెల్లడించిన సంగతి తెలిసిందే. రష్యా ఉక్రెయిన్ మధ్య చర్చలకు ప్రయత్నాలు జరుగుతున్న సమయంలో ఈ దాడులు జరగడం ఉద్రిక్తతలకు దారి తీస్తోంది.