
పాట్నా: బీహార్ లోని బెగుసరై జిల్లా టెఘ్రా ఏరియాలో బుధవారం సాయంత్రం భద్రతా బలగాలకు, నక్సల్స్‌కు మధ్య జరిగిన ఎదురెదురు కాల్పుల్లో వాంటెడ్ నక్సలైట్ దయానంద్ మలకర్ మృతి చెందాడు. సిపిఐ మావోయిస్టు ఉత్తర బీహార్ సెంట్రల్ జోనల్ కమిటీ సెక్రటరీగా ఉన్న మలకర్ అలియాస్ చోటుపై 14 క్రిమినల్ కేసులు నమోదై ఉన్నాయి. ఆయనపై రూ. 50 వేల రివార్డు ప్రకటించి ఉంది. ఆయన ఇద్దరి సహచరులను పోలీసులు అరెస్టు చేశారు.
దయానంద్ ఉనికిపై సమాచారం అందగానే భద్రతా బలగాలు అక్కడికి చేరుకున్నాయని, తన అనుచరులతో దయానంద్ దాక్కున్నాడని, పోలీసులను చూడగానే కాల్పులు ప్రారంభించాడని , ఆత్మరక్షణ కోసం పోలీసులు కాల్పులు జరపాల్సి వచ్చిందని స్పెషల్ టాస్క్ పోలీసులు ప్రకటించారు. గాయపడిన దయానంద్‌ను సమీప ఆస్పత్రికి తీసుకు వెళ్లగా అక్కడ చనిపోయాడని డాక్టర్లు ధ్రువీకరించారని తెలిపారు. ఈ సంఘటనలో ఒక 5.56 ఎంఎం ఇన్సాస్ రైఫిల్, నాటు తుపాకీ, 25 వాడని తూటాలు, ఆ ప్రదేశంలో వాడిన 15 తూటాలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.