Reading Time: < 1 minute

దూర ప్రాంత రైల్వే ప్రయాణికులకు మరింత సౌలభ్యం కలుగనుంది. దేశంలో తొలి సారి వందేభారత్ స్లీపర్ రైలు పట్టాలపైకి రానుంది. ప్రధాని నరేంద్ర మోడీ త్వరలోనే ఈ స్లీపర్ రకం వందేభారత్ రైలుకు గువహతి నుంచి కోల్‌కతా మధ్య పచ్చజెండా చూపడం ద్వారా ప్రారంభిస్తారు. ఈ విషయాన్ని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ గురువారం తెలిపారు. వచ్చే పది లేదా పదిహేను రోజుల్లో ఈ రైలు ప్రారంభోత్సవం ఉంటుంది. పలు నమూనా పరీక్షల సక్రమ నిర్వహణ తరువాత స్లీపర్ రైళ్ల రాకపోకలకు రంగం సిద్ధం అయిందని మంత్రి వెల్లడించారు. రైలు మార్గమధ్యంలో ప్రయాణికులకు రాత్రి పూట ప్రయాణాలు మరింత అనువుగా మారుతాయని మంత్రి గురువారం ఇక్కడ జరిగిన విలేకరుల సమావేశంలో తెలిపారు. ఈ స్లీపర్ వందేభారత్ రాకతో పలు వర్గాల ప్రజలకు ప్రయోజనం చేకూరుతుంది. కేవలం వ్యాపారస్తులకే కాకుండా కుటుంబాలకు , విద్యార్థులు, యాత్రికులకు ఉపయోగపడుతుంది. రెండు నగరాల మధ్య వేగవంతంగా , కుదురైన రీతిలో రాత్రిపూట ప్రయాణాలకు వీలేర్పడుతుంది. తెల్లారేసరికి వారి వారి మజిలీలకు చేరుకుంటారని మంత్రి తెలిపారు. దేశంలోని ఇతర ప్రాంతాల నగరాల మధ్య కూడా ఈ స్లీపర్ వందేభారత్ రైళ్ల రాకపోకలకు ఏర్పాట్లు జరుగుతాయి. విమాన ప్రయాణాలతో పోలిస్తే ఈ స్లీపర్ రైళ్లలో టికెట్ ఛార్జీలు తక్కువగా ఉంటాయి. రాత్రిపూట ప్రయాణాల నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లు , ఎప్పటికప్పుడు నిశిత పరిశీలన నిఘా ఉంటుందని వివరించారు.