Reading Time: < 1 minute

అమెరికా మహానగరం న్యూయార్క్ మేయర్‌గా జోహ్రాన్ మమ్దానీ గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ నగరానికి ఆయన వరుస క్రమంలో 112వ మేయర్ అయ్యారు. స్థానిక మాన్‌హట్టన్‌లోని ఓల్డ్ సబ్ వే స్టేషన్‌లో కొత్త సంవత్సర ఆగమనం దశలో ఆయన ఖురాన్‌పై ప్రమాణం చేసి బాధ్యతలు స్వీకరించారు. అధికారిక హడావిడికి దూరంగా ప్రైవేటు కార్యక్రమంగా ఈ ప్రమాణ స్వీకారం జరిగింది. 34 సంవత్సరాల మమ్దాని న్యూయార్క్‌కు తొలి దక్షిణాసియా , ముస్లిం మేయర్‌గా ఎన్నికయ్యారు. అమెరికాలో చరిత్ర సృస్టించారు. కార్యక్రమానికి ఆయన కుటుంబ సభ్యులు, కొందరు స్నేహితులు హాజరయ్యారు. కొత్త సంవత్సర ఆగమన గంటలు మోగుతున్న దశలో ఆయన ఈ గురుతర బాధ్యతలు స్వీకరించారు. భారతీయ సంతతికి చెందిన మమ్దాని ఇంతకు ముందు

క్వీన్స్ స్టేట్ అసెంబ్లీ సభ్యుడిగా డెమోక్రాటిక్ పార్టీ తరఫున ప్రాతినిధ్యం వహించారు. వలసల నగరంగా పేరొందిన న్యూయార్క్‌కు ప్రధమ పౌరుడిగా ఆయన ఎక్కువగా వలస ప్రజల తరఫున నిలబడటం, పేదల తక్షణ అవసరాలపై ఎక్కువగా ప్రస్తావించడం ద్వారానే రిపబ్లికన్ పార్టీ పోటీని కూడా తట్టుకుని మేయర్‌గా గెలిచారు. న్యూయార్క్‌కు మేయర్‌గా రెండో అతి చిన్న వయస్కుడైన వ్యక్తిగా మద్దానీ గుర్తింపు పొందారు. ఆయనతో సాథనిక అటార్నీ జనరల్ లెటిటియా జేమ్స్ ప్రమాణం చేయించారు. తన వెంబడి భార్య, ఆర్టిస్టు రమా దువాజి నిలిచి ఉండగా ప్రమాణ స్వీకారం చేశారు. భారతీయ చలనచిత్ర దర్శకురాలు మీరా నాయర్ , కొలంబియా యూనివర్శిటీ ప్రొఫెసర్ మహమూద్ మమ్దానీ కుమారుడు అయిన మమ్దానీ అంతకు ముందు మాట్లాడుతూ తమ ప్రమాణస్వీకారం నగరంలో జనం సంక్షేమం దిశలో నూతన అధ్యాయం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.