
స్విట్జర్లాండ్‌లో నూతన సంవత్సర వేడుక దశలో తీవ్ర విషాదం నెలకొంది. స్విస్ అల్ప్ స్కీ రిసార్ట్ టౌన్‌లో ఓ బార్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో 40 మంది దుర్మరణం చెందారు. దాదాపు వంద మంది వరకూ గాయపడ్డారని స్థానిక పోలీసు వర్గాలు తెలిపాయి. లె కాన్సటెలెషన్ బార్ సాధారణంగా పలు విందులు వేడుకలకు పెట్టింది పేరు. కొత్త సంవత్సరం వేళ తమ వారితో ఆనందంగా గడిపేందుకు బార్‌కు వచ్చిన వారిని మంటలు చుట్టుముట్టాయి. అర్థరాత్రి దాటిన తరువాత అంతా జోరుగా హుషారుగా ఉన్న దశలోనే అగ్ని ప్రమాదం జరిగింది . మంటల తరువాత కానీ ముందు కానీ భారీ పేలుడు జరిగిందని స్థానిక మీడియాలో వార్తలు వెలువడ్డాయి. దీనితో దీని వెనుక ఉగ్రవాద చర్య ఉందా? అనే అనుమానాలు తలెత్తాయి. ఈ విషయంపై అధికార వర్గాలు నిర్థారించలేదు. ఘటన వివరాలను వలైస్ కాంటన్ పోలీసు అధికారి ఫ్రెడెరిక్ గిస్లెర్ మీడియాకు తెలిపారు. ఎంత మంది ఆహుతి అయ్యారో ఇప్పటికిప్పుడు చెప్పలేమని, ఓ అంచనా మేరకు 40 మంది వరకూ చనిపోయి ఉంటారని చెప్పారు. పలువురు గుర్తు పట్టడానికి వీల్లేని రీతిలో కాలిపోయారు. దీనితో వీరిని గుర్తించి వారి బందువులకు అవశేషాలను అప్పగించేందుకు అధికారులు యత్నిస్తున్నారు. ఈ ఘటన వెనుక ఎటువంటి విద్రోహ చర్యలేదని భావిస్తున్నామని స్థానిక అటార్నీ జనరల్ బియాట్రిస్ పిలౌడ్ తెలిపారు. వేడుకల సమయంలో బార్‌లో రంగుల కాంతులు ఏర్పడేందుకు ప్రయోగించిన గ్యాస్‌తోనే ప్రమాదం జరిగిందని, మంటలు వేగంతో వ్యాపించి భారీ శబ్ధంతో పేలుడు చోటుచేసుకుందని బార్ ఘటనలో ప్రాణాలతో బయటపడ్డ వారు తెలిపారు. గాయపడ్డ వంద మందిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. వీరిని స్థానిక ఆసుపత్రులలో అత్యవసర చికిత్సకు చేర్పించారు. బాధితులను ఆదుకునేందుకు హెలికాప్టర్లు, అంబులెన్స్‌లు హుటాహుటిన ఘటనా స్థలికి చేరాయి. బార్‌లోపల పూర్తిగా తగులబడి పోవడంతో చాలా మందిని అతి కష్టం మీద గుర్తించాల్సి వచ్చింది. ఈ దారుణ ప్రమాద ఘటనపై స్విట్జర్లాండ్ అధ్యక్షులు గయ్ పర్మీలిన్ తీవ్ర దిగ్భ్రాంతి, విచారం వ్యక్తం చేశారు. సామాజిక మాధ్యమం ద్వారా తమ సంతాపం తెలిపారు. బాధిత కుటుంబాల ఆవేదనను తాను అర్థం చేసుకున్నానని, వారికి అన్ని విధాలుగా ఆత్మస్థయిర్యం కల్పించేందుకు అధికార యంత్రాంగం రంగంలోకి దిగిందని వివరించారు. గురువారమే ప్రెసిడెంట్‌గా తొలి రోజు బాధ్యతలు స్వీకరించాల్సిన పర్మీలిన్ ఈ ఘటనతో తమ కార్యక్రమాన్ని కొద్ది సేపు వాయిదా వేసుకున్నారు. ఆ తరువాతనే జాతిని ఉద్ధేశించి అధికారిక నూతన సంవత్సర సందేశం వెలువరించారు. బార్‌లోపల అన్ని వైపుల నుంచి మంటలు అలుముకున్న దశలో లోపల ఉన్న వారు గాజు అద్దాలను పగులగొట్టి బయటకు దూకారు. ఈ క్రమంలో పలువురు గాయపడ్డారు.
………………………………….