
టెలికాం ఆపరేటర్ వొడా ఫోన్ ఐడియా (విఐఎల్ ) కు గురువారం దాదాపు రూ. 638 కోట్ల జిఎస్టీ జరిమానా విధిస్తూ ఆదేశాలు అందాయి. అహ్మదాబాద్ లోని సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్ అదనపు కమిషనర్ కార్యాలయం ఈ ఆదేశాలను జారీ చేసింది. ఈ ఆర్డర్ తో విభేదిస్తున్నట్లు వొడాఫోన్ ఐడియా తెలిపింది. కోర్టులో ఈ ఆదేశాన్ని సవాల్ చేయనున్నట్లు తెలిపింది.అప్పుల్లోకూరుకుపోయిన టెల్కో కు గ్రాస్ రెవిన్యూ బకాయిలు సర్దుబాటు చేసి, ఊరట కల్పించిన ఒక రోజు తర్వాత ఈ ఆర్డర్ జారీ అయింది. బుధవారం కేంద్ర కేబినెట్ టెల్కో బకాయిలను స్తంభింపజేయడంతో పాటు, ఐదేళ్ల చెల్లింపు మారిటోరియం విధించాలని నిర్ణయించింది. అలాగే ఏజిఆర్ బకాయిలను తిరిగి అంచనా వేయడానికి అనుమతిస్తూ నిర్ణయం తీసుకుంది. వోడాఫోన్ ఐడియా లిమిటెడ్ కు రూ. 6,37,90, 68, 256 జరిమానాను వర్తించే డిమాండ్, వడ్డీ తో సహా నిర్థారిస్తూ సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ యాక్ట్ 2017 సెక్షన్ 74 కింద ఉత్తర్వులు జారీ అయినట్లు బిఎస్ ఇ ఫైలింగ్ లో పేర్కొంది. వొడా ఫోన్ ఐడియా సంస్థ పన్ను తక్కువగా చెల్లించడం, ఇన్ పుట్ టాక్స్ క్రెడిట్ ను అధికంగా పొందడం వంటి ఆరోపణల కారణంగా ఈ జరిమానా విధించినట్లు వెల్లడైంది.