
ద్విచక్ర వాహనం అదుపు తప్పి వెనుక నుంచి డీసీఎంను ఢీకొట్టిన ఘటనలో ఓ యువతి మృతి చెందగా, యువకుడు తీవ్ర గాయాలకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ సంఘటన నార్సింగి పోలీసుస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రామంతాపూర్ కు చెందిన శ్రీహరి కుమార్తె కావ్య (20). తాండూరు మల్కాపూర్కు చెందిన నర్సింహ్మరెడ్డి కుమారుడు కౌశిక్ రెడ్డిలు హిమాయత్ నగర్‌లో శ్రీ చైతన్య డీమ్డ్ కాలేజీలో బీసీఏ మూడవ సంవత్సరం చదువుతున్నారు. బుధవారం రాత్రి కావ్య కౌశిక్ రెడ్డితో కలిసి ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్నారు. ఈ తరుణంలో అజీజ్‌నగర్ నుంచి కాళీమందిర్ వెళ్లే రహదారిపై రాష్ట్ర పోలీసు అకాడమీ సమీపంలోని నవనామి మాగెలియో కన్స్ట్రక్షన్ సైట్ వద్ద వేగంగా వెళుతున్న వాహనం నియంత్రణ తప్పి రోడ్డు పక్కన నిలిచి ఉన్న డిసీఎం వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో కావ్య అక్కడికక్కడే మృతి చెందగా, కౌశిక్ రెడ్డి రెనోవా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.