
ఫిబ్రవరి 1వ తేదీ నుంచి పొగాకుపై అదనపు ఎక్సైజ్ సుంకం విధిస్తారు. ఇక పాన్ మసాలాపై హెల్త్ సెస్సు కూడా అమలులోకి వస్తుంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం అధికారిక సమాచారం వెలువరించింది. జిఎస్‌టి స్థాయి కన్నా ఎక్కువగా పొగాకు, పాన్ మసాలాలలపై ఈ కొత్త విధింపులు పడుతాయని వివరించారు. ఆరోగ్యానికి చేటు కల్గించే ఇటువంటి ఉత్పత్తులపై ఇంతకు ముందటి వరకూ ఉన్న పరిహార సుంకం బదులు ఇప్పుడు కొత్త అదనపు సుంకాలు, హెల్త్ సెస్సు అమలులోకి వస్తాయి. ఈ ఉత్పత్తుల వాడకం తగ్గింపు క్రమంలోనే ఈ నిర్ణయం తీసుకున్నారని వెల్లడించారు. ఇక గురువారమే ఆర్థిక మంత్రిత్వశాఖ ఓ ప్రకటన వెలువరించింది.
తినే పొగాకు , జర్దా కలిపిన సుగంధ పొగాకు ఉత్పత్తులు , గుట్కా ప్యాకింగ్ మెషిన్ల రూల్స్ 2026ను కూడా ఇప్పుడు నోటిఫై చేశారు. కొత్త సుంకాలకు ఫిబ్రవరి 1వ తేదీని గడువుగా ముందుగానే ఖరారు చేశారు. ఇప్పుడున్న జిఎస్‌టి సంబందిత పరిహార సెస్సు ఇకపై ఉండదు, ఇంతకు ముందు ఇది ఆయా ఉత్పత్తులను బట్టి వేర్వేరుగా ఉంటూ వచ్చింది. ఇప్పుడు అత్యధిక రీతిలో ఒకే విధంగా వర్తింపచేస్తారని ప్రకటనలో తెలిపారు. పొగాకు ఉత్పత్తులపై అధిక సుంకాలు, ఆరోగ్య , జాతీయ భద్రతా సెస్సును ఖరారు చేస్తూ డిసెంబర్‌లోనే పార్లమెంట్ రెండు బిల్లులు ఆమోదించింది. వీటికి అనుగుణంగానే ఇప్పుడు సుంకాల విధింపు ప్రకటన వెలువరించారు.