
న్యూఢిల్లీ : గిగ్ వర్కర్ల సమ్మె ప్రభావం ఏమీ పడలేదు. దేశవ్యాప్తంగా కొత్త ఏడాది సంబరాల దశలో ఫుడ్ ప్యాకెట్ల విక్రమాలు జోరందుకున్నాయి. స్విగ్గి, జొమాటో, మ్యాజిక్‌పిన్ ద్వారా ఆర్డర్ల సంఖ్యలో జోరు కనపడిందని ఆయా సంస్థల వేర్వేరు ప్రకటనలతో వెల్లడైంది. ఓ వైపు తమక సరైన కమిషన్, పని భద్రత కల్పించాలని గిగ్ వర్కర్లు విధులను బహిష్కరించినా, దీని ప్రభావం కనబడలేదు. ఫుడ్ డెలివరీ ఇంతకు ముందటితో పోలిస్తే ఎక్కువగా నమోదు అయింది. సమ్మె ఉన్నప్పటికీ తాము తీసుకున్న పలు ప్రత్యామ్నాయ చర్యలతో గంట గంటకు ఆర్డర్ల సంఖ్య పెరిగిందని ఫుడ్ పంపిణి కంపెనీ మ్యాజిక్ పిన్ తమ ప్రకటనలో తెలిపింది. కొత్త ఏడాది ఆరంభంలో ప్రతి గంటకు లక్షలాది ఆర్డర్లు అందుకున్నామని, వీటి పంపిణి కూడా జరిగిందని వివరించారు. ఇదే విషయాన్ని జోమాటో, స్విగ్గి కూడా వేర్వేరుగా నిర్థారించాయి. బుధవారం ఒక్కరోజే 67 లక్షల వరకూ ఆర్డర్లు అందాయని జొమాటో, క్విక్ కామర్స్ సంస్థ బ్లింకెట్‌ల మూల కంపెనీ ఎటెర్నెల్ వ్యవస్థాపకుడు దీపిందర్ గోయల్ ఎక్స్ వేదిక ద్వారా ప్రకటించారు. దేశంలోని 22 నగరాలు, పట్టణాలకు చెందిన 1 లక్ష మందికి పైగా గిగ్ వర్కర్లు సమ్మెలో పాల్గొన్నారని గిగ్ ప్లాట్‌ఫాం సర్వీస్ వర్కర్స్ యూనియన్ వర్గాలు గురువారం తెలిపాయి. ఇందులో 14వేల మంది వరకూ వర్కర్లు ప్రధాన నగరాలు అయిన ముంబై, ఢిల్లీ ఇతర నగరాలకు చెందిన వారు ఉన్నారు.