
హరీష్ రావు కృష్ణా, గోదావరి నదీ జలాలు, పాలమూరు,రంగారెడ్డి ప్రాజెక్టుపై దుష్ప్రచారం చేస్తుండగా కెటిఆర్ రైతులకు యూరియా సరఫరాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని భువనగిరి ఎంపి, చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ నూతన సంవత్సరం తొలి రోజునే కెటిఆర్ గోబెల్స్ ప్రచారాన్ని మొదలుపెట్టారని, ఒక పక్క హరీష్ రావు, మరోపక్క కెటిఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజా పాలనపైన విమర్శలు చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. వారిద్దరూ ప్రజా సమస్యలు, వాస్తవాల గురించి మాట్లాడాలని ఆయన సూచించారు. బిఆర్‌ఎస్‌ను పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు భూ స్థాపితం చేశారన్నారు. 2024-, 2025 సంవత్సరానికి వానాకాలం పంటకు 9.66 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను తెలంగాణకు తెప్పించామని, యాసంగికి 10.41 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను తీసుకువచ్చామని, బిఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో ఈ స్థాయిలో ఎప్పుడూ యూరియా తీసుకురాలేదని ఆయన తెలిపారు. 2025, -2026 వానాకాలం పంటకు 9.79 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా తీసుకొచ్చామని, యూరియాను తీసుకురావడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడా ఫెయిల్ కాలేదని ఆయన పేర్కొన్నారు.