
బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా మరో హిందువుపై దాడి చేశారు. డిసెంబర్ 31న షరియత్‌పూర్ జిల్లాలో ఒక హిందూ వ్యక్తిపై ఆయుధాలతో హింసాత్మక మూక దాడి చేసింది. ఆ తర్వాత వంటికి నిప్పంటించడంతో అతను తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. మీడియా నివేదికల ప్రకారం, బాధితుడిని 50 ఏళ్ల ఖోకన్ దాస్‌గా గుర్తించారు. అతను ఇంటికి తిరిగి వస్తుండగా, కొందరు దుండగులు అతన్ని చుట్టుముట్టారు. పదునైన ఆయుధాలతో అతనిపై దాడి చేసి ఆ తర్వాత నిప్పంటించారు. దీంతో అతను తీవ్ర గాయాలపాలయ్యాడు.
కాగా, గత 15 రోజుల్లో బంగ్లాదేశ్‌లో హిందువులపై జరిగిన నాల్గవ దాడి ఇది. మొదట, డిసెంబర్ 18న, మైమెన్‌సింగ్‌లో దీపు చంద్ర దాస్ అనే హిందూ యువకుడిని ఒక మూక దారుణంగా చంపింది.ఆ తర్వాత అతని మృతదేహాన్ని రోడ్డు మధ్యలో ఉన్న ఒక చెట్టుకు వేలాడదీసి నిప్పంటించారు. ఇక, డిసెంబర్ 24న, బంగ్లాదేశ్‌లోని కాలిమోహర్ యూనియన్‌లోని హుస్సేన్‌దంగా ప్రాంతంలో ఒక మూక 29 ఏళ్ల అమృత్ మోండల్‌ను కొట్టి చంపినట్లు ఆరోపణలు వచ్చాయి. మైమెన్‌సింగ్‌లోని భలుకాలోని ఒక టెక్స్‌టైల్ ఫ్యాక్టరీలో జరిగిన మరో సంఘటనలో ఒక హిందూ యువకుడిని అతని సహోద్యోగి తుపాకీతో కాల్చి చంపాడు. ఇలా హిందువులపై వరుస దాడులు జరగడం ఆందోళన కలిగిస్తోంది.