Reading Time: < 1 minute

మూడు వరుస ఘన విజయాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాలలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న స్టార్ ఎంటర్‌టైనర్ నవీన్ పొలిశెట్టి, 2026 సంక్రాంతికి తన తదుపరి చిత్రం ‘అనగనగా ఒక రాజు’తో అలరించనున్నారు. ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మిస్తుండగా, శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తోంది. నూతన దర్శకుడు మారి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి కథానాయిక. మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నారు. అసలుసిసలైన పండగ చిత్రంగా జనవరి 14న థియేటర్లలో అడుగుపెట్టనున్న ’అనగనగా ఒక రాజు’పై భారీ అంచనాలు ఉన్నాయి.

హైదరాబాద్ లో ’రాజు గారి పెళ్లి రిసెప్షన్ వేడుక’ను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో కథానాయకుడు నవీన్ పొలిశెట్టి మాట్లాడుతూ.. “వినోదంతో నిండిన ఈ చిత్రాన్ని సంక్రాంతి పండుగకు తీసుకొస్తున్నాము. సంక్రాంతికి సినిమా అంటేనే వినోదం. నేను, మీనాక్షి సహా టీమ్ అందరం మనసు పెట్టి పనిచేశాం. జనవరి 14న విడుదలవుతున్న ’అనగనగా ఒక రాజు’ చిత్రాన్ని అందరూ కుటుంబంతో కలిసి చూసి ఆనందిస్తారని మేము ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాము”అని అన్నారు. కథానాయిక మీనాక్షి చౌదరి మాట్లాడుతూ.. “ఇది నా మూడో సంక్రాంతి సినిమా. ’అనగనగా ఒక రాజు’లో భాగం కావడం చాలా సంతోషంగా ఉంది. ఆద్యంతం వినోదభరితంగా ఉండే ఈ చిత్రం అందరికీ నచ్చుతుందనే నమ్మకం ఉంది. ఎందుకంటే ఇదొక మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌”అని తెలిపారు.