
బంగ్లాదేశ్ తొలి మహిళా ప్రధానమంత్రి ఖలీదా జియా దీర్ఘకాలిక అనారోగ్యంతో మంగళవారం నాడు కన్నుమూశారు. ఆమెవయస్సు 80 సంవత్సరాలు. ఈ మధ్యనే ప్రవాసం నుంచి స్వదేశానికి వచ్చిన, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బిఎన్ పి) యాక్టింగ్ చైర్మన్ రెహమాన్ తన తల్లి మరణవార్తను ప్రకటించారు. బేగం ఖలీదా జియా దశాబ్దాలుగా అల్ల కల్లోల సైనిక పాలన తర్వాత దేశంలో ప్రజాస్వామ్య పునరుద్ధరణలో కీలక పాత్ర వహించారు. 1991-1996, 2001-2006 మధ్య పదేళ్ల పాటు బంగ్లాదేశ్ ప్రధానిగా ఉన్నారు. అవినీతి కేసులో 2018- 2020 మధ్య ఆమె జైలు జీవితం గడిపారు.
గుండె, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ కారణంగా, ఢాకా లోని ఎవర్ కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఖలిదా మంగళవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచినట్లు ఆమె వ్యక్తిగత వైద్యుడు డాక్టర్ జాహింద్ హుస్సేన్ తెలిపారు. ఆమె కుటుంబ సభ్యులు, ఆమె పెద్దకుమారుడు తారిక్ రెహమాన్, అతని బార్య జుబైదా రెహమాన్, వారి కుమార్తె జైమా ఆస్పత్రిలో ఉన్నారు. బీఎన్ పి సెక్రటరీ జనరల్ మీర్జా ఫక్రుల్ ఇస్లాం అలంగీర్ కూడా ఆస్పత్రిలో ఉన్నారు.
బుధవారం పార్లమెంటు సౌత్ ప్లాజా, పక్కనే ఉన్న మానిక్ మియా అవెన్యూలో జోహార్ ప్రార్థనల తర్వాత జియా అంత్యక్రియలు జరుగుతాయి. ఢాకా లోని షేర్ -ఎ- బంగ్లా నగర్ లోని జియా ఉద్యాన్ లో అమె భర్త, మాజీ ప్రెసిడెంట్, బిఎన్ పి వ్యవస్థాపకుడు జియావుర్ రెహమాన్ సమాధి పక్కనే , పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో ఆమె అంత్యక్రియలు నిర్వహిస్తారు.
బంగ్లాదేశ్ ప్రధాన సలహాదారు మహమ్మద్ యూనస్ టెలివిజన్ లో మాట్లాడుతూ ప్రసంగిస్తూ, మాజీ ప్రధాని బేగం ఖలీదా జియా మరణం పట్ల, మూడు రోజుల సంతాప దినాలు, రేపు అంత్యక్రియల రోజున ఒక రోజు సాధారణ సెలవుదినంగా ప్రకటించారు. నవంబర్ 23న బేగం ఖలీదా జియా ఎవర్ కేర్ ఆస్పత్రిలో చేరారు. ఆ సమయంలో ఛాతీ ఇన్ఫెక్షన్ కు చికిత్స ఆరంభించారు. నవంబర్ 27న ఆమె పరిస్థితి దిగజారింది. దీంతో సిసియు లో చేర్చారు. జియా కాలేయం, మూత్ర పిండాల సమస్యలు, గుండె జబ్బులు, అధిక రక్త పోటు, మధుమేహం, ఆర్థరైటిస్, ఇతర ఇన్ఫెక్షన్ ల వల్ల దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో మరణించారు.
ప్రధాని మోదీ సంతాపం
భారత ప్రధాని నరేంద్రమోదీ, ఖలీదా జియా మృతికి సంతాపం వ్యక్తం చేశారు. బంగ్లాదేశ్ తొలి మహిళా ప్రధానిగా, దేశాభివృద్ధికి, భారత- బంగ్లాదేశ్ సంబంధాలు మెరుగుపడేందుకు ఆమె చేసిన కృషిని ప్రశంసించారు. 2015లో ఢాకాలో బేగం ఖలీదా తో జరిగిన సమావేశాన్ని గుర్తు చేసుకున్నారు.