Reading Time: < 1 minute

బంగ్లాదేశ్‌లో మరో హిందువు హత్యకు గురయ్యాడు. మైమెన్‌సింగ్‌లోని భాలుకాలో ఉన్న ఓ వస్త్ర కర్మాగారంలో బజేంద్ర బిస్వాస్ (42) అనే హిందూ అన్సార్ సభ్యుడిని అతని సహోద్యోగి గన్‌తో కాల్చి చంపాడు. అన్సార్ అనేది గ్రామ రక్షణ విభాగంగా పనిచేసే ఒక పారామిలిటరీ దళం. సాధారణంగా, అన్సార్ సిబ్బందిని కర్మాగారాలు, బ్యాంకులు, ఎన్నికలు, ప్రభుత్వ సంస్థల వద్ద భద్రత కల్పించడానికి నియమిస్తారు. ఫ్యాక్టరీ భద్రత కోసం నియమించబడిన బజేంద్ర బిస్వాస్ హత్యను పోలీసులు నిర్ధారించారు. నిందితుడు 22 ఏళ్ల నోమాన్ మియాగా గుర్తించిన పోలీసులు అతడిని అరెస్టు చేశారు. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సంఘటన జరిగిన సమయంలో ఫ్యాక్టరీలో సుమారు 20 మంది అన్సార్ సిబ్బంది విధుల్లో ఉన్నారని స్థానికులు తెలిపారు. బజేంద్ర బిస్వాస్, నోమాన్ మియా ప్రాంగణంలో కలిసి కూర్చున్నప్పుడు, నోమాన్ వద్ద ఉన్న షాట్‌గన్ అనుకోకుండా పేలడంతో ఈ సంఘటన జరిగింది. ఆ బుల్లెట్ బిస్వాస్ ఎడమ తొడకు తగిలింది. దీంతో తీవ్రంగా గాయపడిన బజేంద్ర బిస్వాస్‌ను సహోద్యోగులు చికిత్స కోసం భాలుకా ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అయితే, బిస్వాల్ అప్పటికే మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నామని పోలీసులు పేర్కొన్నారు.