
పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఆయిల్ కంపెనీలు నష్టాల్లో ఉన్నాయి.. నష్టాలను పూడ్చుకునేందుకు భారీ ఎత్తున పెంపు ఉండొచ్చునని.. ఇప్పటికే ఆయిల్ కంపెనీలు హింట్ ఇస్తూ వచ్చాయి. ఈ క్రమంలో 2026 మే 15వ తేదీన పెట్రోల్ డీజిల్ పై 3 రూపాయలకు పైగా ధరలు పెంచారు. ఈ క్రమంలో.. ఈ పెంపు ఇంతటితో ఆగుతుందా.. ఇంకా పెరుగుతుందా..? పెరిగితే ఎంత వరకు పెరగవచ్చు అనేది ఇప్పుడు సామాన్యుల నుంచి వస్తున్న ప్రశ్న.
రోజుకు 1600 వందల కోట్ల నష్టం..
ఇండియన్ ఆయిల్, బీపీసీఎల్, హెచ్‌పిసీఎల్ వంటి ప్రభుత్వ రంగ ఆయిల్ కంపెనీలు..రోజుకు అక్షరాల పదహారు వందల కోట్ల రూపాయలు చొప్పున నష్టపోతున్నాయి. ఇలాగే కొనసాగితే ఆయిల్ కంపెనీల మనుగడ కష్టం అవుతుందని ఆందోళన చెందుతున్నాయి. ఈ క్రమంలోనే.. పెట్రోల్, డీజిల్ ధరల పెంపు కొనసాగే అవకాశాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.
ఇరాన్ యుద్ధం కారణంగా ఏర్పడిన అనిశ్చితితో ఆయిల్ కంపెనీలు రోజుకు 1600 రూపాయలు నష్టపోతున్నట్లు పేర్కొన్నాయి. ఈ క్రమంలో ప్రస్తుతం పెంచిన 3 రూపాయలతో ఆగకుండా క్రమక్రమంగా పెంచే యోచనలో కంపెనీలు ఉన్నాయి. ప్రస్తుతం రెవెన్యూ గ్యాప్ 30-36.5 శాతంగా ఉందని పేర్కొంటున్నాయి. ఇది పూడ్చాలంటే కనీసం 28 నుంచి 33 రూపాయలకు వరకు పెంచాల్సి ఉందని చెబుతున్నాయి.
అంటే ఇప్పుడు పెంచిన 3 రూపాయలతో పాటు ఇంకా 30 రూపాయలు పెంచితే కంపెనీల నష్టాలను పూడ్చేయవచ్చునని అంటున్నారు. ఈ లెక్కన చూస్తే మరికొద్ది రోజుల్లో విడతల వారీగా భారీగా ధరల మోత మోగనుందని భావిస్తున్నారు.
ధరలు క్రమంగా పెరుగుతాయా?
ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు రూ. 3.89 వరకు పెంచాయి కంపెనీలు. ఈ పెంపు అనేది దశలవారీగా పెంచే వ్యూహంలో భాగం కావచ్చు. అయితే లాస్ లను పూరించాలంటే కనీసం 33 రూపాయల వరకు పెంచాల్సి ఉంది. అయితే ఒకేసారి పెంచడం వలన ద్రవ్యోల్బణం (ఇన్ ఫ్లేషన్) వచ్చే ప్రమాదం ఉండటంతో దశలవారీగా పెంచేందుకు నిర్ణయం తీసుకున్నారు.
పెరుగుతున్న ముడి చమురు ధరల రేట్లను చేరుకోవాలంటే కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలు చివరికి లీటరుకు రూ. 28-33 మేర పెంచాల్సి రావచ్చని కోటక్ ఇన్‌స్టిట్యూషనల్ ఈక్విటీస్ అంచనా వేసింది. హార్ముజ్ జలసంధి నుంచి చమురు రవాణాలో ఏర్పడిన అంతరాయాలు, అమెరికా-ఇరాన్ ఘర్షణ వాతావరణంలో ప్రపంచ వ్యాప్తంగా ముడి చమురు ధరలు పెరిగాయి. ఈ క్రమంలోనే ఇండియాలో భారీగా రేట్లు పెంపుకు సిద్ధమవుతున్నాయి చమురు కంపెనీలు.