
భారత క్రికెట్ రంగంలో ఒక అద్భుతమైన ప్రతిభగా వైభవ్ సూర్యవంశీ దూసుకొచ్చాడు. అతి పిన్న వయసులోనే తన బ్యాటింగ్ విన్యాసాలతో దిగ్గజాల దృష్టిని ఆకర్షించిన ఈ యువ ఆటగాడు, దేశవాళీ క్రికెట్‌లో చూపిన అసాధారణ ప్రతిభ కారణంగా ఐపీఎల్ వేదికపై భారీ గుర్తింపు పొందాడు. కేవలం 13-14 ఏళ్ల వయసులోనే ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో అరంగేట్రం చేసి రికార్డు సృష్టించిన సూర్యవంశీ, తన అటాకింగ్ బ్యాటింగ్ శైలికి పెట్టింది పేరు. మైదానంలో నలుమూలలా షాట్లు ఆడగల సామర్థ్యం, ఒత్తిడిలోనూ భయం లేకుండా ఆడుతూ ఆధునిక క్రికెట్ అవసరాలకు అనుగుణంగా వేగవంతమైన స్కోరు సాధించడమే ఇతని ప్రధాన బలం. భవిష్యత్తులో భారత సీనియర్ జట్టుకు కీలక ఆటగాడిగా మారే లక్షణాలు వైభవ్‌లో మెండుగా కనిపిస్తున్నాయి.
అయితే.. ఐపీఎల్ చరిత్రలో ఏ బ్యాటర్ కూడా ఊహించని రీతిలో వైభవ్ సూర్యవంశీ ఒక అసాధారణమైన మైలురాయిని అధిగమించాడు. ఏప్రిల్ 22న రాజస్థాన్ రాయల్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య ఏకానా స్టేడియంలో జరిగిన ఉత్కంఠభరిత పోరులో ఈ యువ ఆటగాడు సరికొత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత తక్కువ బంతుల్లో 500 పరుగుల మార్కును అందుకున్న ఆటగాడిగా వైభవ్ చరిత్ర సృష్టించాడు. కేవలం 227 బంతుల్లోనే ఈ ఘనత సాధించడం విశేషం.
అంతకుముందు ఈ రికార్డు ఆస్ట్రేలియా విధ్వంసకర బ్యాటర్ గ్లెన్ మాక్స్‌వెల్ పేరిట ఉండేది. మాక్స్‌వెల్ 500 పరుగులు పూర్తి చేయడానికి 260 బంతులు తీసుకోగా, వైభవ్ దానిని భారీ తేడాతో బద్దలు కొట్టాడు. ఈ జాబితాలో వైభవ్ తర్వాత మాక్స్‌వెల్ (260), ప్రియాంశ్ ఆర్య (278), వీరేంద్ర సెహ్వాగ్ (280), నమన్ ధీర్ (283), మరియు ట్రావిస్ హెడ్ (284) వంటి దిగ్గజ బ్యాటర్లు ఉండటం గమనిస్తే వైభవ్ ఎంత వేగంగా పరుగులు సాధిస్తున్నాడో అర్థం చేసుకోవచ్చు.
అయితే.. ఈ చారిత్రాత్మక రికార్డు నమోదైన మ్యాచ్‌లో వైభవ్ వ్యక్తిగతంగా పెద్ద స్కోరు చేయలేకపోయాడు. కేవలం 10 బంతులు ఎదుర్కొన్న అతను 8 పరుగులు మాత్రమే చేసి, 11వ బంతికి అవుట్ అయ్యాడు. మొహ్సిన్ ఖాన్ వేసిన బంతిని లాంగ్-ఆన్ మీదుగా భారీ షాట్ ఆడే క్రమంలో బంతి బ్యాట్ అంచుకు తగిలి గాలిలోకి లేవగా, దిగ్వేష్ రాఠీ అద్భుతమైన క్యాచ్ పట్టడంతో వైభవ్ ఇన్నింగ్స్ ముగిసింది. ఏది ఏకమైనప్పటికీ.. సెహ్వాగ్ మరియు మాక్స్‌వెల్ వంటి పవర్‌హిట్టర్ల రికార్డులను అధిగమించి వైభవ్ సూర్యవంశీ సృష్టించిన ఈ ‘ఫాస్టెస్ట్ 500’ రికార్డు ఐపీఎల్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది.