Reading Time: 2 minutes
Pakistan Punjab Buffalo Diapers Heavy Fine Cattle Dung Roads

సాధారణంగా మనం చిన్న పిల్లలు ఇల్లు అపరిశుభ్రం చేయకుండా ఉండటానికో లేదా ప్రయాణాల్లో ఇబ్బంది కలగకుండా ఉండటానికో డైపర్లు వాడుతుంటాం. ఇది సాధారణంగా చిన్న పిల్లలు ఉన్న ఇంట్లో ఉండేది. కానీ, పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. అక్కడ పసిపిల్లలతో పాటు.. భారీ కాయం ఉన్న బర్రెలకు, ఆవులకు డైపర్లు కడుతున్నారు. వినడానికి నవ్వులాటగా అనిపించినా… అక్కడి పశువుల యజమానులు పడుతున్న తిప్పలు చూస్తుంటే ఇది నిజంగానే ఒక వింత పరిస్థితి అంటారు. పారిశుధ్యం పేరుతో ప్రభుత్వం తీసుకున్న ఒక కఠిన నిర్ణయం, ఇప్పుడు పశువుల యజమానులను ఈ వినూత్న మార్గంలో ఆలోచించేలా చేసింది.

అసలేం జరిగింది..?
పాకిస్థాన్ పంజాబ్ ప్రభుత్వం నగరాల్లో పారిశుధ్యాన్ని మెరుగుపరచడానికి “ముఖ్యమంత్రి క్లీన్ పంజాబ్” అనే కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా రోడ్లు, బహిరంగ ప్రదేశాలు మురికిగా మారకుండా ఉండటానికి కఠిన నిబంధనలు అమలులోకి తెచ్చింది. ముఖ్యంగా పశువుల పేడ వల్ల రోడ్లు పాడవుతున్నాయని, దుర్వాసన వస్తోందని ప్రభుత్వం భావించింది. అందుకే.. ఎవరైనా తమ పశువులను రోడ్లపైకి తెచ్చి, అవి అక్కడ పేడ వేస్తే భారీగా జరిమానాలు విధిస్తామని ప్రకటించింది.

Also Read:Star Hero : స్టార్ హీరో స్ట్రాంగ్ కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్

భారీ జరిమానాలు..
ప్రభుత్వ నిబంధనల ప్రకారం, బహిరంగ ప్రదేశాల్లో పేడ వేసి అపరిశుభ్రం చేస్తే దాదాపు రూ. 30,000 వరకు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. సామాన్య పశువుల యజమానులకు ఇది చాలా పెద్ద మొత్తం. ఈ భారీ జరిమానాల నుంచి తప్పించుకోవడానికి వారు ఒక వింత ఉపాయాన్ని కనిపెట్టారు.

పెద్ద పెద్ద గోనె సంచులు లేదా మందపాటి క్లాత్ బ్యాగులను పశువుల వెనుక భాగంలో కడుతున్నారు. పశువులు పేడ వేసినప్పుడు అది నేరుగా రోడ్డు మీద పడకుండా ఆ సంచిలోనే పడిపోతుంది. దీనివల్ల రోడ్లు శుభ్రంగా ఉంటున్నాయి.. యజమానులు జరిమానా భయం లేకుండా పశువులను రోడ్లపై తీసుకెళ్లగలుగుతున్నారు.

ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు ఇంటర్నెట్‌లో తెగ వైరల్ అవుతున్నాయి. గేదెలు భారీ సంచులను తగిలించుకుని రోడ్లపై నడుస్తుంటే చూసేవారికి నవ్వు తెప్పిస్తోంది. అయితే.. పారిశుధ్యం పట్ల ప్రభుత్వానికి ఉన్న పట్టుదలను కొందరు మెచ్చుకుంటుంటే, పశువుల మీద ఇలాంటి ప్రయోగాలు చేయడం వల్ల వాటికి ఇబ్బంది కలుగుతుందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా.. “అవసరం అన్ని పనులూ నేర్పిస్తుంది” అన్నట్లుగా.. జరిమానా భయం పాకిస్థాన్ పంజాబ్ రైతులతో ఈ వింత పని చేయిస్తోంది.