
PM Modi: పశ్చిమ బెంగాల్‌లోని బిష్ణుపూర్‌లో జరిగిన ‘విజయ సంకల్ప సభ’లో ప్రధాని నరేంద్ర మోదీ తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మహిళా వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ, కేంద్ర పథకాలను అడ్డుకుంటున్న టీఎంసీకి ఈ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. మహిళా సాధికారతే లక్ష్యంగా బీజేపీ అధికారంలోకి వస్తే చేపట్టబోయే పథకాలను ప్రధాని వివరించారు
మాతృశక్తి భరోసా కార్డు: రాష్ట్రంలోని ప్రతి మహిళకు ఈ కార్డు ద్వారా ఏటా రూ.36,000 ఆర్థిక సాయం అందిస్తామని ప్రధాని హామీ ఇచ్చారు.
గర్భిణీలకు సాయం: గర్భిణీ స్త్రీలకు రూ. 21,000 ప్రత్యక్ష నగదు బదిలీతో పాటు, బిడ్డ పుట్టినప్పుడు అదనంగా రూ.5,000 సాయం అందుతుందని పేర్కొన్నారు.
విద్య, భవిష్యత్తు: ఆడపిల్లల చదువు, భవిష్యత్తు కోసం రూ. 50,000 ఆర్థిక సాయం అందజేస్తామని వాగ్దానం చేశారు.
ఆరోగ్యం, గృహవసతి: ఆయుష్మాన్ భారత్ కింద రూ.5 లక్షల వరకు ఉచిత వైద్యం, పక్కా ఇళ్ల నిర్మాణానికి రూ.1.5 లక్షల సాయం అందిస్తామన్నారు.
టీఎంసీపై విరుచుకుపడిన ప్రధాని..
పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ బిల్లును టీఎంసీ వ్యతిరేకించడాన్ని మోడీ తప్పుబట్టారు. “బెంగాల్ సోదరీమణుల కలలను టీఎంసీ నీరుగార్చింది. మహిళల రాజకీయ భాగస్వామ్యం ఆ పార్టీకి ఇష్టం లేదు” అని మండిపడ్డారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పట్ల టీఎంసీ నేతల అనుచిత వైఖరిని ప్రస్తావిస్తూ, గిరిజన మహిళల పట్ల ఆ పార్టీకి ఉన్న చిన్నచూపును ఎండగట్టారు. టీఎంసీ ప్రభుత్వం ఓటు బ్యాంకు రాజకీయాల కోసం చొరబాటుదారులకు కొమ్ముకాస్తోందని ఆరోపించారు. మతం ఆధారంగా రిజర్వేషన్లు కల్పించే ప్రయత్నాలు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని, దీనిని తాము సహించబోమని స్పష్టం చేశారు. పేదలకు అందాల్సిన ఉచిత రేషన్లను కూడా రాష్ట్ర ప్రభుత్వం సక్రమంగా పంపిణీ చేయడం లేదని ధ్వజమెత్తారు.
బెంగాల్‌లో మహిళల భద్రత ప్రశ్నార్థకంగా మారిందని, బీజేపీ అధికారంలోకి వస్తే శాంతిభద్రతలను కఠినంగా అమలు చేస్తామని ప్రధాని హామీ ఇచ్చారు. కేంద్ర పథకాలను రాష్ట్రంలో అమలు కాకుండా అడ్డుకుంటున్న ‘స్పీడ్ బ్రేకర్’ ప్రభుత్వాన్ని సాగనంపాలని ఆయన ప్రజలను కోరారు. వచ్చే ఎన్నికల్లో బెంగాల్‌లో మార్పు తథ్యమని, మహిళల శక్తితోనే అభివృద్ధి చెందిన భారతదేశం, అభివృద్ధి చెందిన బెంగాల్ నిర్మాణం సాధ్యమవుతుందని మోడీ అన్నారు.