
ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ మధ్య జరుగుతున్న చర్చల్లో ప్రతిష్టంభన నెలకొన్నట్లుగా అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. శాంతి చర్చల కోసం ఇరాన్, అమెరికా ప్రతినిధుల బృందాలు ఇస్లామాబాద్ చేరుకున్నాయి. అయితే చర్చలకు ముందు ఇరాన్ తన డిమాండ్లను ముందు పెట్టింది. అయితే లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు ఆపితేనే చర్చల్లో పాల్గొంటామని ఇరాన్ వాదించినట్లుగా తెలుస్తోంది. ముందు లెబనాన్‌లో పరిస్థితులు చక్కబడాలని ఇరాన్ డిమాండ్ చేసినట్లుగా సమాచారం.
అయితే ముందు తమ షరతులు అంగీకరిస్తేనే అమెరికాతో చర్చలు జరుపుతామని ఇరాన్ తెగేసి చెప్పినట్లుగా తెలుస్తోంది. మెహర్ న్యూస్ ఏజెన్సీ నివేదిక ప్రకారం.. ఇరాన్ ప్రతినిధి బృందం తమ డిమాండ్లపై పట్టుదలతో ఉన్నట్లుగా పేర్కొంది. అమెరికా ప్రతినిధి బృందం షరతులను అంగీకరిస్తుందా లేదా అనే దానిపైనే చర్చలు ఆధారపడి ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే చర్చలు ఒక్కరోజులో పూర్తి కావని.. రెండు రోజుల పాటు కొనసాగవచ్చని వార్తలు వస్తున్నాయి.
ఇరాన్ డిమాండ్లు ఇవే..
ఇరాన్ ప్రధానంగా లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు ఆపాలని.. అలాగే అమెరికా ఫ్రీజ్ చేసిన ఆస్తులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తోంది. ఈ డిమాండ్లకు అంగీకరిస్తేనే చర్చల్లో పాల్గొంటామని ఇరాన్ చెబుతోంది. అయితే ప్రస్తుతం పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ రెండు బృందాలతో పరోక్ష చర్చలు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. రెండు బృందాల నుంచి సానుకూల స్పందన వస్తే మాత్రం.. ఈ రాత్రికి రెండు దేశాల మధ్య ప్రత్యక్ష చర్చలు ఉండనున్నాయి.
అయితే ఈ చర్చలు ఫలిస్తాయా? లేదా? అన్నది సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అయితే చర్చలు విఫలమైతే మాత్రం ఇరాన్‌పై అమెరికా తీవ్ర స్థాయిలో దాడి చేస్తుందని.. అంతేకాకుండా హార్ముజ్ జలసంధి కూడా తెరుస్తామని ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు.
ఇదిలా ఉంటే ఓ వైపు చర్చలు జరుగుతుండగానే.. ఇంకోవైపు లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులతో విరుచుకుపడుతోంది. శనివారం జరిగిన దాడిలో ముగ్గురు చనిపోయారు. ఈ దాడులు చర్చలపై ప్రభావం చూపించే అవకాశం ఉంది.