
మన తెలంగాణ/హైదరాబాద్: సిఎం రేవంత్‌రెడ్డి హెచ్చరించినా పలు జిల్లాలో ఇసుక జీరో దందా ఆగడం లేదు. ప్రస్తుతం 20 ఇసుకరీచ్‌లు నడవకుండా కొందరు ప్రజా ప్రతినిధుల బెదిరింపులకు పాల్పడుతుండడంతో టిజిఎండిసి పరిధిలోని ఆ యా రీచ్‌ల్లో ఇసుక డిడిల విక్రయాలను ఆ సంస్థ నిలిపివేసినట్టుగా తెలిసింది. అయితే, ఇదే అదునుగా స్థానికంగా ఉండే కొందరు ప్రజాప్రతినిధు లు ఆయా రీచ్‌ల నుంచి అక్రమంగా ఇసుకను లా రీల్లో తరలిస్తూ జీరో దందా నడుపుతూ సొమ్ము చేసుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నా యి. 10 రోజుల క్రితం మైనింగ్‌కు సంబంధించి జరిగిన సమీలో కొన్ని జిల్లాలో స్థానిక ప్రజా ప్రతినిధులు రీచ్‌లను నడవకుండా అడ్డుకుంటున్న విషయాన్ని టిజిఎండిసి ఉన్నతాధికారులు సిఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. దీనివల్ల టిజిఎండిసి ఆదాయానికి గండిపడుతుందని వారు సిఎంకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోనే సిఎం రేవంత్‌రెడ్డి రీచ్‌ల నుంచి ఇసుకను తరలింపును అడ్డుకునే ఏ ప్రజాప్రతినిధి అయినా సరే వాళ్లమీద కేసులు పెట్టాలని పోలీసు ఉన్నతాధికారులను, విజిలెన్స్ అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 26 రీచ్‌ల్లో మాత్రమే ఇసుకను విక్రయిస్తుండగా మరో 20 రీచ్‌లు మాత్రం మూసివేసినట్టుగా తెలిసింది. మూసివేసిన రీచ్‌ల్లో ములుగు, జయశంకర్ భూపాలపల్లి, మహబూబ్‌నగర్, కరీంనగర్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని కొన్ని రీచ్‌లు ఉన్నట్టుగా సమాచారం. మూతపడిన రీచ్‌లతో ఆ సంస్థ ఆదాయాన్ని కోల్పోతుండడం విశేషం.
వే బిల్లులు లేకుండా తిరుగుతున్న లారీలపై విజిలెన్స్ కొరడా
అయినా, కొందరు ప్రజాప్రతినిధులు సిఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలను ఖాతరు చేయడం లేదని, జీరో దందా కింద ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇదే విషయమై ప్రభుత్వానికి ఫిర్యాదులు అందుతుండడంతో ప్రస్తుతం కొన్ని జిల్లాలో వే బిల్లులు లేకుండా అక్రమంగా తిరుగుతున్న ఇసుక లారీలపై విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ఇసుక లారీలపై కేసులను నమోదు చేస్తున్నారు. దీంతోపాటు ప్రస్తుతం మూసివేసిన ఆ 20 ఇసుకరీచ్‌ల్లో టిజిఎండిసి ఇసుకను విక్రయించడానికి కసరత్తు చేస్తున్నా కొందరు ప్రజా ప్రతినిధులు టిజిఎండిసి అధికారులకు సహకరించడం లేదని తెలుస్తోంది. ఒకవేళ తమను కాదని ఇసుకరీచ్‌లను తెరిస్తే లారీలను అడ్డుకుంటామని, స్థానికంగా రీచ్‌ల్లో అధికారులు, సిబ్బంది విధులు నిర్వహించకుండా చూస్తామని ప్రజాప్రతినిధులు బెదిరిస్తున్నట్టుగా తెలిసింది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం మూసివేసిన ఇసుకరీచ్‌లను టిజిఎండిసి అధికారులు ఓపెన్ చేయకుండా అలాగే వదిలేసినట్టుగా సమాచారం.
రీచ్‌ల టెండర్‌లలో లోపాలతో..
ప్రస్తుతం ఇసుకరీచ్‌లను కొన్నేళ్లుగా కొందరు కాంట్రాక్టర్‌లే దక్కించుకోవడం, రీచ్‌ల టెండర్‌లలో పారదర్శకత లేకపోవడం, కొందరు కాంట్రాక్టర్‌లే రింగ్‌గా మారి ఎక్కువగా రీచ్‌లను దక్కించుకోవడం వల్లే ఆ సంస్థ ఆదాయం కోల్పోతుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతోపాటు ప్రస్తుతం టిజిఎండిసి ఎండి భవేశ్‌మిశ్రా వేరే శాఖల్లో అదనపు బాధ్యతలు నిర్వర్తించడం ఈ శాఖపై పూర్తిస్థాయి సమయాన్ని కేటాయించకపోవడంతో ఇసుకరీచ్‌ల వద్ద జరుగుతున్న అక్రమాలపై ఆయన దృష్టి సారించడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతోపాటు ఇసుకరీచ్‌ల వద్ద పిఓలుగా పనిచేయడానికి రెవెన్యూ శాఖ నుండి డిప్యూటేషన్‌పై రావడానికి చాలామంది ఉత్సాహం చూపుతున్నారు. దీంతో వారు డిప్యూటేషన్ వచ్చినప్పటి రోజుకు లక్షల రూపాయలను దండుకుంటూ సంస్థకు చెడ్డపేరు తీసుకువస్తున్నారని, దీనిపై ప్రభుత్వం దృష్టి సారించాలని ఆ శాఖ ఉద్యోగులు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రస్తుతం టిజిఎండిసి సంస్థకు చెందిన వారిలో 9 మంది మాత్రమే ఆ శాఖ ఉద్యోగులు ఉండగా మిగతా వారంతా వేరే శాఖ నుంచి డిప్యూటేషన్ వచ్చి ఈ సంస్థ ఆదాయాన్ని కొల్లగొడుతున్నారని ఆ శాఖ ఉద్యోగులు ఆరోపిస్తుండడం విశేషం.
ఈనెలాఖరు నాటికి రూ.1,000 కోట్లు
టిజిఎండిసి సంస్థ ఫిబ్రవరి నాటికి రూ.910 కోట్ల ఆదాయాన్ని ఆర్జించగా ఈనెలాఖరు నాటికి అది రూ.1,000 కోట్లకు చేరుకుంటుందని ఆ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. అయితే, రానున్న ఆర్థిక సంవత్సరం 202627గాను రూ.1,300 కోట్ల ఆదాయాన్ని రాబట్టాలని ప్రభుత్వం నిర్ధేశించినట్టుగా తెలిసింది. ఈ సంస్థను 2014లో ప్రత్యేక కార్పొరేషన్‌గా ఏర్పాటు చేయగా అప్పటి నుంచి ఇప్పటివరకు అత్యధికంగా రూ.880 కోట్ల ఆదాయాన్ని మాత్రమే ఈ సంస్థ ఆర్జించింది. ప్రస్తుతం ఈ ఆర్థిక సంవత్సరంలో (202526) లో రూ.1,000 కోట్లు వస్తే అది రికార్డు అని ఆ శాఖ అధికారులు పేర్కొంటున్నారు.