
రాబోయే మూడేళ్లలో రాష్ట్రంలో శాశ్వత భవనాలు లేని గ్రామపంచాయతీలన్నింటికి శాశ్వత భవనాలు నిర్మించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. ఆ మేరకు పంచాయతీరాజ్ శాఖ ప్రణాళికలు సిద్ధం చేసుకుని ముందుకు పోవాలని సూచించారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో ప్రీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా మంత్రి సీతక్కతో కలిసి ఆయా శాఖలపై మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ స్థలాలు అందుబాటులో ఉన్నచోట తహసీల్దార్ కార్యాలయాలు, ఎంపీడీవో కార్యాలయాలు కలిపి నిర్మించే అవకాశాలు పరిశీలించాలని సూచించారు. అంగన్వాడి కేంద్రాల్లో చిన్నారుల ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని సూచించారు. చిన్నారుల మెదడు బలంగా ఎదిగేందుకు అవసరమైన పౌష్టిక ఆహారంతో పాటు బోధనా పద్ధతులతో వారికి తర్ఫీదు ఇవ్వాలని సూచించారు. పట్టణాల్లో రహదారులపైన కొంత మంది చంటి బిడ్డలను పెట్టుకొని యాచక వృత్తి కొనసాగిస్తున్న వారందరినీ శిశు విహార్‌లో తీసుకొని అవసరమైన చర్యలు చేపట్టాలని రోడ్లపై చంటి బిడ్డలు పట్టపగలు ఎండకు, వర్షాకాలంలో వానకు తడిసి వారి విలువైన బాల్యం మసకబారి పోతుందని అన్నారు. ఆ విధంగా జరగడానికి అవకాశం లేకుండా చూడాలని డిప్యూటీ సీఎం తెలిపారు.