
ప్రపంచ వాస్తవ ఆర్థిక వ్యవస్థతో దేశ విద్యారంగాన్ని అనుసంధానించాలి
వృద్ధుల జనాభా పెరుగుతున్న కొద్దీ సహాయకులకు డిమాండ్
ప్రత్యేక వెబినార్‌లో ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యలు
న్యూఢిల్లీ : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆటోమేషన్ వంటి అంశాలపై దృష్టి సారించాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. దేశ విద్యా రంగాన్ని వాస్తవ ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో అనుసంధానించే ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. సోమవారంనాడు ఓ వెబినార్‌లో ప్రసంగించిన ఆయన ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడమే తమ ప్రభుత్వ సంకల్పమన్నారు. విద్య, నైపుణ్యాభివృద్ధి, ఆరోగ్యం, పర్యాటకం, క్రీడలు, సంస్కృతి వంటి అందుకు ఒక మాధ్యమంగా పనిచేస్తాయని అన్నారు.
‘ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడం అనేది కేవలం ఒక అంశం మాత్రమే కాదు, ఇది మా ప్రభుత్వ ప్రధాన లక్ష్యం మరియు తీర్మానం’ అన్నారు. వివిధ ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, విభాగాలు, ప్రైవేట్ రంగాల నిపుణులు పాల్గొన్న వెబినార్లో ఆయన మాట్లాడుతూ.. దేశంలో విద్యను ఉపాధి సంబంధిత సంస్థలతో అనుసంధానించడానికి నిరంతర ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. కొత్త జాతీయ విద్యా విధానం (ఎన్‌ఈపీ) ముఖ్యంగా ఏఐ, ఆటోమేషన్, డిజిటల్ ఎకానమీ వంటి రంగాలలో మార్కెట్ డిమాండ్లు, వాస్తవ ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు అనుగుణంగా ఉండాల్సిన పాఠ్యాంశాలకు పునాదిని అందిస్తుందన్నారు.
మన విద్యా వ్యవస్థను వాస్తవ ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో అనుసంధానించే ప్రక్రియను వేగవంతం చేయాల్సి ఉంటుంది అని ఆయన అన్నారు. మరో ముఖ్యమైన రంగం స్టెమ్ సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ మరియు మ్యాథమెటిక్స్ అని ప్రధాని అన్నారు. దేశ పౌరులకు స్టెమ్ సైన్స్ పట్ల అత్యంత ఆసక్తి ఉండటం ఆనందంగా ఉందన్నారు. నూతన ఆవిష్కరణలపై పనిచేయడానికి యువ పరిశోధకులకు తగినంత అవకాశాలు లభించే పరిశోధనా పర్యావరణ వ్యవస్థను మనం సృష్టించాలి అని ఆయన అన్నారు.
ఆరోగ్య రంగం బలోపేతం అయిందని, ఆయుష్మాన్ భారత్ యోజన, గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సేవలను మరింతగా వ్యాప్తి చేయడానికి దారితీశాయని ఆయన అన్నారు. శిక్షణ పొందిన సంరక్షకులు సీనియర్ సిటిజన్లకు సహాయపడే ‘కేర్ ఎకానమీ’ గురించి ప్రస్తావిస్తూ వృద్ధుల జనాభా పెరిగే కొద్దీ సంరక్షకుల డిమాండ్ కూడా పెరుగుతుందని మోడీ అన్నారు. కొత్త శిక్షణా నమూనాలను అభివృద్ధి చేయాలని మోడీ పిలుపునిచ్చారు.