Reading Time: < 1 minute

ఐసిసి టి-20 ప్రపంచకప్-2026 విజేతగా భారత జట్టు నిలిచింది. టోర్నమెంట్ ఆద్యంతం అన్ని రంగాల్లో రాణించి పొట్టి ఫార్మాట్ ట్రోఫీని మూడోసారి ముద్దాడింది. ప్రతీ మ్యాచ్‌లోనూ ఎవరో ఒక ప్లేయర్ జట్టుకు విజయాన్ని అందించి హీరోలుగా నిలిచారు. కానీ, ఒక ప్లేయర్ మాత్రం అందరినీ ఆశ్చర్యపరిచేలా ప్రదర్శన చేశాడు. తొలుత ఫామ్ లేమి కారణంగా బెంచ్‌కే పరిమితమై.. ఆ తర్వాత జట్టులోకి వచ్చే అవకాశం రావడంతో దాన్ని సద్వినియోగం చేసుకొని ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’గా నిలిచాడు. అవును.. అతడే సంజూ శాంసన్. టోర్నీలో తొలి నాలుగు మ్యాచ్‌లు సంజూ బెంచ్‌కే పరిమితమయ్యాడు. ఆ తర్వాత జట్టులో చోటు దక్కించుకొని.. ఐదు మ్యాచుల్లోనే అద్భుతం చేశాడు.

ఐదు మ్యాచుల్లో 80.2 యావరేజ్, 199.37 స్ట్రైక్‌రేటుతో 321 పరుగులు చేశాడు. అంతేకాక వరుసగా మూడు అర్థ శతకాలు సాధించి టీం ఇండియా స్టార్ విరాట్ కోహ్లీ రికార్డును బ్రేక్ చేశాడు. ఈ టోర్నమెంట్‌లో అత్యధికంగా 24 సిక్సులు బాదాడు. వరుసగా నాలుగు మ్యాచుల్లో ఎదుర్కొన్న మొదటి బంతికే సిక్సర్ బాది ఇన్నింగ్స్ ప్రారంభించిన ఏకైక ఆటగాడిగా ప్రపంచరికార్డు సృష్టించాడు. వెస్టిండీస్‌పై 97(నాటౌట్), సెమీస్‌లో ఇంగ్లండ్‌పై 89, ఫైనల్‌లో న్యూజిలాండ్‌పై 89 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. తద్వారా ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా నిలిచాడు.

అయితే ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా నిలిచినా.. సంజూకు ఒక్క రూపాయి నగదు బహుమానం కూడా అందుకోలేదు. దీనికి కారణం ఐసిసి నిబంధనలు. ఐసిసి తన అధికారిక అవార్డుల కింద ఆటగాళ్లకు కేవలం ట్రోఫీలు మాత్రమే ఇస్తుంది.. నగదు ఇవ్వదు. ఒక క్రికెటర్‌కు ఈ ప్రతిష్టాత్మక ట్రోఫీని అందుకోవడం అనేది నగదు కంటే గొప్ప గౌరవంగా భావిస్తారు. అందుకే సంజూకు ఎలాంటి నగదు అందలేదు. ఇక అవార్డు అందుకున్నాక సంజూ మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యాడు. ‘‘నా కల నెరవేరింది. 2024 వరల్డ్‌కప్ నుంచి నేను ఈ క్షణం కోసం ఎదురుచూస్తున్నాను. మధ్యలో నేను ఫామ్ కోల్పోయినప్పుడు అసలు జట్టులోకి వస్తానో లేదో అని భయపడ్డాను. కానీ, దేవుడి దయవల్ల నాకు అవకాశం దక్కింది. ఈ అద్భుతం జరిగింది’’ అని అన్నాడు.