
డిసెంబర్ 9లోపు పూర్తిగా ఎలక్ట్రిక్ బస్సులు తీసుకువస్తాం
పెట్రోల్, డీజిల్ ఆటోలనూ ఎలక్ట్రిక్‌గా మార్చుతాం
ఇవి వాహనాలు కొనుక్కుంటే జీరో ట్యాక్స్
ఉక్కు మహిళ సోనియాగాంధీ సంకల్పంతోనే తెలంగాణ వచ్చింది
దేశంలో ఏ పదవైనా మహిళలకు ఇచ్చిన పార్టీ కాంగ్రెస్
మహిళలను పారిశ్రామికవేత్తలుగా మార్చడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది
మహిళలో ఉన్న నైపుణ్యాన్ని గుర్తించి అండగా ఉండటం కోసం
హైటెక్ సిటీ పక్కనే రూ.1000 కోట్ల విలువైన మూడున్నర ఎకరాల స్థలంలో
150 స్టాల్స్‌కు స్థలం కేటాయించాం
స్థానిక టాలెంట్‌ను గ్లోబల్ టాలెంట్‌గా మార్చడం కోసం ప్రయత్నం చేస్తున్నాం
హైదరాబాద్‌ను కాలుష్య రహిత నగరంగా మార్చేందుకు చర్యలు
మూసీని ప్రక్షాళన చేస్తామంటే అడ్డుపడుతున్నారు
మూసీ ప్రక్షాళన వద్దంటున్నారా… తొలగింపులు వద్దంటున్నారో స్పష్టత ఇవ్వాలి
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
ప్రజాభవన్‌లో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు
హాజరైన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు
మహిళా జర్నలిస్టులకు సన్మానం
మనతెలంగాణ/హైదరాబాద్ : ఉక్కు మహిళ సోనియాగాంధీ సంకల్పంతోనే తెలంగాణ వచ్చిందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. మహిళలకు తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని పేర్కొన్నారు. మహిళలను పారిశ్రామికవేత్తలుగా మార్చడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని అన్నారు. మహిళలో ఉన్న నైపుణ్యాన్ని గుర్తించి అండగా ఉండటం కోసం హైటెక్ సిటీ పక్కనే రూ.1000 కోట్ల విలువైన మూడున్నర ఎకరాల స్థలంలో 150 ఇందిరా మహిళా స్టాల్స్‌కు స్థలం కేటాయించినట్లు తెలిపారు. స్థానిక టాలెంట్‌ను గ్లోబల్ టాలెంట్‌గా మార్చడం కోసం ప్రయత్నం చేస్తున్నామని పేర్కొన్నారు. తెలంగాణను అగ్రస్థానంలో నిలపడంలో మహిళల కృషి ఎంతో ఉందని చెప్పారు.
మహిళల భద్రతకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, వారికి అన్ని వేళలా అండగా ఉంటామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. ప్రజాభవన్‌లో ఆదివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు సిఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సిఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మహిళా జర్నలిస్టులకు సన్మానం చేశారు. ఈ సందర్భంగా సిఎం రేవంత్‌రెడ్డి ప్రసంగించారు. మహిళలకు ఎప్పుడూ గుర్తింపు ఇవ్వాలన్నదే తమ లక్ష్యమని చెప్పారు. దేశంలో ఏ పదవైనా మహిళలకు ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ అని తెలిపారు.
రాష్ట్రపతి, ప్రధాని, లోక్‌సభ స్పీకర్, ముఖ్యమంత్రులు, పార్టీ అధ్యక్షులుగా దేశంలో అన్ని పదవులను కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందని అన్నారు. కీలకమైన శాఖలను మహిళా అధికారులు సమర్థంగా నడిపిస్తున్నారని ప్రశంసించారు. మహిళలకు సరైన గుర్తింపు ఇవ్వాలని ప్రజాప్రభుత్వం నిర్ణయించిందని అన్నారు. ఎక్కడ అవకాశం ఉన్నా, ఉన్నత పదవుల్లో మహిళలను నియమిస్తున్నామని అన్నారు. హైదరాబాద్ కలెక్టర్‌గా మహిళ బాధ్యత వహిస్తున్నారని, ఎస్‌ఐబి అధిపతిగా మహిళను పెట్టామని తెలిపారు. వెయ్యి బస్సులకు మహిళలు యజమానులుగా ఉన్నారని ప్రస్తావించారు. తెలంగాణ మహిళలు తయారు చేస్తున్న వస్తువులను అమెజాన్‌లో పెట్టి ప్రపంచానికి అందిస్తున్నామని అన్నారు. మహిళా జర్నలిస్టులకు ప్రత్యేక గుర్తింపు ఇస్తున్నామని స్పష్టం చేశారు.
హైదరాబాద్‌ను కాలుష్య రహిత నగరంగా మార్చుతున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. 2026 డిసెంబర్ 9లోపు పూర్తిగా ఎలక్ట్రిక్ బస్సులు తీసుకువస్తామని అన్నారు. పెట్రోల్, డీజిల్ ఆటోలనూ ఎలక్ట్రిక్‌గా మార్చుతామని అన్నారు. విద్యార్థినులకు ఎలక్ట్రిక్ స్కూటీలు ఇస్తామని హామీ ఇచ్చారు. ఈవీ వాహనాలు కొనుక్కుంటే జీరో ట్యాక్స్ అని పేర్కొన్నారు. చంద్రబాబు, రాజశేఖర్ రెడ్డి హైదరాబాద్‌ను అభివృద్ధి చేశారని కొనియాడారు. రెడ్, ఆరెంజ్ కేటగిరి పరిశ్రమలను ఒఆర్‌ఆర్ బయటకు పంపిస్తామని పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని డీజిల్ బస్సులను 2026 డిసెంబర్‌లోపు జిల్లాలకు తరలిస్తామని, హైదరాబాద్‌లో 100 శాతం ఈవీ బస్సులను తెస్తున్నామని అన్నారు. డిసెంబర్ 9లోపు డీజిల్ బస్సులు హైదరాబాద్‌లో ఉండవని, హైదరాబాద్‌లో ఎసి ఈవీ బస్సులు తెస్తామని తెలిపారు.
మహిళ శ్రమకు గుర్తింపు లేదు
మహిళ ఆర్థిక శక్తి పెరిగినప్పుడే ఆ దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందుతుందని సిఎం అన్నారు. దేశంలో మహిళ శ్రమకు గుర్తింపు లేదని విచారం వ్యక్తం చేశారు. దేశంలో కుల, జెండర్ వివక్ష ఉందని, అమెరికాలో కూడా వివక్ష ఉందని.. కానీ అక్కడ కష్టానికి గుర్తింపు ఉంటుందని తెలిపారు. ఇక్కడ మాత్రం కష్టపడే వారికి గుర్తింపు ఉండదని చెప్పారు. కష్టపడేవారికి గుర్తింపు ఇవ్వాల్సిన అవసరం ఎంతో ఉందని తెలిపారు. మహిళలను ప్రోత్సహించాల్సిన బాధ్యత అన్ని సంస్థలపైనా ఉంటుందన్నారు. అదే ఐడియాలజీతో యుద్ధం చేస్తే మంచి ఫలితాలు వస్తాయని వెల్లడించారు.
ఇటీవల మావోయిస్టుల లొంగుబాటులోనూ మహిళా అధికారులే కీలకంగా వ్యవహరించారని తెలిపారు. తమ ప్రభుత్వం ఇచ్చే అవకాశాలను అందిపుచ్చుకుని ఉన్నత స్థానాలకు చేరాలని ఆకాంక్షించారు. మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించామని, నిర్వహణ బాధ్యతలూ అప్పగించామని వ్యాఖ్యానించారు. మహిళల ఆర్థిక శక్తిని పెంచాలనేదే తమ ప్రభుత్వ లక్ష్యమని, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా రాష్ట్రం ఎదగాలని ఆకాంక్షించారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను పెంచే ప్రణాళికలను తయారు చేశామని పేర్కొన్నారు.
మూసీ ప్రక్షాళన వద్దంటున్నారా..?
హైదరాబాద్‌లో కాలుష్యం, దోమలు ఎక్కువగా ఉన్నాయంటున్నారని, మూసీని ప్రక్షాళన చేస్తామంటే అడ్డుపడుతున్నారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. మూసీ ప్రక్షాళన వద్దంటున్నారా… తొలగింపులు వద్దంటున్నారో స్పష్టత ఇవ్వాలని కోరారు. నష్ట పరిహారం ఇచ్చే బఫర్ జోన్‌లోని ఇళ్లను తొలగిస్తామని స్పష్టం చేశారు. 50 మీటర్ల బఫర్ జోన్ అనేది చట్టంలో ఉందని తాను మార్చలేనని చెప్పారు. నిర్వాసితులకు ప్రత్యామ్నాయం చూపిస్తామని హామీ ఇచ్చారు. ఎవరూ మీతో ఉండరని, ఓట్ల కోసమే మీ దగ్గరకు వస్తున్నారని ప్రతిపక్ష నేతలను ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. ఇటీవల ఓ అపార్ట్‌మెంట్ విషయంలో రాద్ధాంతం చేశారని దుయ్యబట్టారు.
మూసీ ప్రక్షాళన వద్దంటున్నారా..?, తొలగింపులు వద్దంటున్నారా..? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. అలాంటి పరిస్థితులు రాకుండా చూడాల్సిన బాధ్యత మనపై ఉందని తెలిపారు. నదుల బఫర్ జోన్లలో ఎలాంటి కట్టడాలకు అనుమతులు లేవని స్పష్టం చేశారు. అలాంటి చోట నిర్మాణాలు చేపట్టినా తొలగించాల్సి వస్తుందని తేల్చిచెప్పారు. ఇలాంటి అంశాల్లో రాజకీయాలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. ఢిల్లీలో యమునా రివర్ ఫ్రెంట్, యూపీలో గంగా నది రివర్ ఫ్రెంట్ చేశారు.. కాని హైదరాబాద్ లో మూసీ రివర్ ఫ్రెంట్ మాత్రం వద్దంటున్నారని అన్నారు. పొలిటికల్ క్యాపీటల్ గా ఉన్న ఢిల్లీ వాయు కాలుష్యం వల్ల ఇబ్బందిపడుతోందని, ముంబయి కూడా అనేక సమస్యలతో ఇబ్బంది పడుతోందని చెప్పారు. చైన్నైలో వరదల సమస్య ఉందని అన్నారు. దేశంలోనే బెస్ట్ సిటీ హైదరాబాద్ అని వ్యాఖ్యానించారు. సౌత్ కొరియా, న్యూయార్క్,టోక్యోతో హైదరాబాద్ పోటీ పడేలా ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. ఈనెల 13వ తేదీన మూసీ పునరుజ్జీవంపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తామని, డిపిఆర్ కూడా ప్రజెంట్ చేస్తామని పేర్కొన్నారు.
గాంధీ విగ్రహానికి రూ.70 కోట్లే ఖర్చు
గాంధీ విగ్రహం కట్టడానికి రూ.500 కోట్లు అని తప్పుడు ప్రచారం చేస్తున్నారని సిఎం రేవంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గాంధీ విగ్రహానికి రూ.70 కోట్లే ఖర్చు అవుతుందని చెప్పారు. గాంధీ విగ్రహం వద్ద విజ్ఞాన మందిరానికి రూ.100 కోట్లు ఖర్చు చేస్తున్నామని వెల్లడించారు. కాలుష్యంతో హైదరాబాద్ నాన్ లివింగ్ సిటీగా మారే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
సోషల్ మీడియాలో అవాస్తవాల ఫిర్యాదులకు ఏర్పాట్లు
సోషల్ మీడియాలో అవాస్తవాల ప్రచారంపై ఫిర్యాదులకు ఏర్పాట్లు చేస్తున్నామని సిఎం రేవంత్‌రెడ్డి అన్నారు. మీడియాపై ఫిర్యాదు చేయడానికి ఒక అథారిటీ ఉందని, అలాగే సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు కథనాలపై ఫిర్యాదు కోసం ఒక కొత్త విధానాన్ని తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నామని వెల్లడించారు. జర్నలిస్టు ముసుగులో వ్యాపారం, వ్యవహారం చేసేవాళ్ళపై చర్యలకు ఒక విధానాన్ని తెస్తామని సిఎం అన్నారు. ఫీల్డ్ జర్నలిస్టులకు, డెస్క్ జర్నలిస్టులకు తేడా లేదని స్పష్టం చేశారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలపైన త్వరలోనే మంచి వార్త చెపుతామని వెల్లడించారు.
చట్టం వల్ల ఇబ్బంది లేకుండా ఇళ్ల స్థలాలపైన నిర్ణయం తీసుకుంటామని అన్నారు. ప్యూచర్ సీటీలో జర్నలిస్టులకు మంచి కాలనీని డిజైన్ చేద్దామని చెప్పారు. సురవరం ప్రతాప్ రెడ్డి గోల్కొండ పత్రికను నడిపించారని, గొప్ప పోరాటలను పత్రికల ద్వారా నడిపించడం ద్వారా శాంతియుతంగా యుద్ధాని గెలవవచ్చునని నిరూపించారని వ్యాఖ్యానించారు. ఆయుధాలతో కూడిన యుద్ధం విషాదంతో ముగుస్తుందని అన్నారు. సిద్ధాంతపరమైన యుద్ధం చేస్తే దేశానికి స్వాతంత్య్రాన్ని తెచ్చుకోవచ్చునని మహాత్మాగాంధీ నిరూపించారని తెలిపారు. తన ప్రయాణంలో అనేక మంది జర్నలిస్టులు,మహిళా జర్నలిస్టులు తన శ్రేయోభిలాషులుగా ఉన్నారని చెప్పారు.