Reading Time: 2 minutes

అదరగొట్టిన సంజు, అభిషేక్, ఇషాన్

బుమ్రా, అక్షర్ హవా, ఫైనల్లో కివీస్ ఓటమి

ప్రపంచ ఛాంపియన్ టీమిండియా

అహ్మదాబాద్: టి20 క్రికెట్‌లో టీమిండియా చరిత్ర సృష్టించింది. ఆదివారం అహ్మదాబాద్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్లో ఆతిథ్య భారత్ 96 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి ప్రపంచ ఛాంపియన్‌గా అవతరించింది. ఈ క్రమంలో మూడో ట్రోఫీ సాధించి ఈ ఘనత సాధించిన తొలి జట్టుగా నిలిచింది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 255 పరుగుల భారీ స్కోరును సాధించింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ 19 ఓవర్లలో 159 పరుగులకే కుప్పకూలింది.

భారత బౌలర్లు అసాధారణ బౌలింగ్‌తో టీమిండియాకు చారిత్రక విజయం సాధించి పెట్టారు. కివీస్‌లో ఓపెనర్ టిమ్ సిఫర్ట్ 26 బంతుల్లోనే 5 సిక్స్‌లు, రెండు ఫోర్లతో 52 పరుగులు చేసినా ఫలితం లేకుండా పోయింది. కెప్టెన్ సాంట్నర్ (43), మిఛెల్ (17) తప్ప మిగతా వారు ఘోరంగా విఫలం కావడంతో న్యూజిలాండ్‌కు ఘోర పరాజయం తప్పలేదు. భారత బౌలర్లలో జస్‌ప్రిత్ బుమ్రా అద్భుతంగా రాణించాడు. 4 ఓవర్లలో 15 పరుగులు మాత్రమే ఇచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు. అక్షర్ మూడు వికెట్లు తీసి తనవంతు సహకారం అందించాడు.

శుభారంభం..

అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేపట్టిన భారత్‌కు ఓపెనర్లు అభిషేక్ శర్మ, సంజు శాంసన్‌లు కళ్లు చెదిరే శుభారంభం అందించారు. వరుస వైఫల్యాలు చవిచూస్తున్న అభిషేక్ కీలకమైన ఫైనల్ మ్యాచ్‌లో మాత్రం తన మార్క్ బ్యాటింగ్‌తో చెలరేగి పోయారు. ప్రారంభం నుంచే న్యూజిలాండ్ బౌలర్లపై ఎదురుదాడి చేస్తూ స్కోరును పరిగెత్తించాడు. సంజు కూడా తన జోరును కొనసాగించాడు. ఇటు సంజు అటు అభిషేక్‌లు చెలరేగి పోవడంతో స్కోరు వేగంగా పరిగెత్తింది. ఈ జోడీని విడగొట్టేందుకు ప్రత్యర్థి బౌలర్లు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. చెలరేగి ఆడిన అభిషేక్ 21 బంతుల్లోనే ఆరు ఫోర్లు, మూడు భారీ సిక్సర్లతో 52 పరుగులు చేశాడు.

ఈ క్రమంలో 7.1 ఓవర్లలోనే తొలి వికెట్‌కు 98 పరుగులు జోడించాడు. తర్వాత వచ్చిన ఇషాన్ కిషన్ కూడా దూకుడైన బ్యాటింగ్‌ను కనబరిచాడు. అతని అండతో సంజు మరో కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఇషాన్, సంజులు పోటీ పడి షాట్‌లు కొట్టడంతో స్కోరు సునామీల పరిగెత్తింది. వీరిని కట్టడి చేసేందుకు ప్రత్యర్థి జట్టు బౌలర్లు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఇక కీలక ఇన్నింగ్స్ ఆడిన శాంసన్ 46 బంతుల్లోనే 8 సిక్సర్లు, 5 ఫోర్లతో 89 పరుగులు చేసి ఔటయ్యాడు. ఇక చెలరేగి బ్యాటింగ్ చేసిన ఇషాన్ 25 బంతుల్లోనే 4 సిక్స్‌లు, 4 ఫోర్లతో 54 పరుగులు చేశాడు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (0) డకౌటయ్యాడు. చివర్లో శివమ్ దూబె 8 బంతుల్లోనే అజేయంగా 26 పరుగులు చేసి జట్టుకు భారీ స్కోరు సాధించి పెట్టాడు.