
బళ్లారి: కర్ణాటకలోని బళ్లారిలో దారుణం చోటు చేసుకుంది. ఓ ప్రైవేటు గురుకుల పాఠశాల హాస్టల్‌లో నిద్రిస్తున్న తోటి విద్యార్థులపై పదో తరగతి విద్యార్థి ఒకరు కత్తి, రాడ్లతో దాడికి దిగాడు. అడ్డుకున్న వార్డెన్, సెక్యూరిటీ సిబ్బందిపై కూడా దాడి చేశాడు. ఈ ఘటనలో ఓ విద్యార్థి మృతి చెందగా.. ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన విద్యార్థులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. హత్యకు గురైన బాలుడిని ఎపిలోని కర్నూలు జిల్లాకు చెందిన విద్యార్థిగా గుర్తించారు. ఘటన జరిగిన వెంటనే జిల్లా పోలీసు అధికారి డాక్టర్ డి సుమన్ పెన్నేకర్ పాఠశాలను పరిశీలించారు. అనంతరం చికిత్స పొందుతున్న విద్యార్థులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.