
మహిళలు అన్ని రంగాల్లో సమాన భాగస్వామ్యులు అయితేనే దేశ సమగ్రాభివృద్ధి సాధ్యమవుతుంది. వేగంగా మారుతున్న జీవన ప్రమాణాలు, పోటీతత్వం, సంస్కృతి, సంప్రదాయాలలో మార్పు జరుగుతున్నా.. నేటి సమాజంలో మహిళలపట్ల అసమానతలు ఇంకా సమసిపోలేదు అని చెప్పవచ్చు. పరిమిత వనరులు, లింగ వివక్షత, సాంప్రదాయం, కట్టుబాట్లు మహిళల అభివృద్ధికి అవరోధాలు అవుతున్నాయి. ఈ పరిస్థితిని అధిగమించాలంటే మహిళలు తమ సామర్థ్యాన్ని, నైపుణ్యాన్ని మెరుగుపరుచుకోవాలి. స్త్రీ, పురుషుల సమానత్వం అనేది సమాజానికి ఎంతో ముఖ్యం. ఆకాశంలో సగం అంటూ మహిళలను ఎంతగానో వర్ణించారు. మరి అటువంటి మహిళలు అభివృద్ధి సాధించడం, సమానత్వం సాధించడం అనేది సమాజానికి ఎంతో అవసరం. ఒకప్పటి విషయం మాట్లాడుకుంటే.. మానవుడు సహజంగా అభివృద్ధి చెందుతున్నంత వరకు ఈ సమానత్వం కొనసాగింది. ఎప్పుడైతే ప్రకృతి శక్తులను తన అవసరాలకు కాకుండా అత్యాశకు వాడుకోవడం మొదలైందో అప్పటినుండి ప్రకృతికి దూరంగా జరుగుతూ చెడుకు చేరువయ్యాడు. ఈక్రమంలో మహిళలకు గల కొన్ని పరిమితులను ఆధారంగా చేసుకొని ఆధిపత్యం చేలాయించడం ప్రారంభించాడు పురుషుడు. ఫలితంగా అణచివేతలు మొదలయ్యాయి.
అయితే తర్వాత కాలంలో 19వ శతాబ్దంలో స్త్రీల అభివృద్ధి కి చాలా ప్రయత్నాలు జరిగాయి. అనిబీసెంట్ 1917లో స్త్రీ విద్యా వ్యాప్తికి విశేష కృషిచేశారు. దుర్గాబాయ్ దేశ్‌ముఖ్ ఆంధ్ర మహిళా సభ ద్వారా స్త్రీలలో విద్యావ్యాప్తికి, వారికి ఉద్యోగాలు కల్పించడానికి విశేష కృషి చేశారు. అయితే మన దేశానికి స్వాతంత్య్రం వచ్చాక మహిళాభ్యుదయానికి విశేష కృషి జరిగింది. భారత తొలి ప్రధాని నెహ్రూ జనసంఖ్యలో సగం ఉన్న స్త్రీలు వెనకబడి ఉంటే భారత జాతి అభివృద్ధి కాదని, పురుషులతోపాటు ప్రాథమిక హక్కును, ఓటు హక్కును, సమానత్వంను కల్పించి, మహిళల హక్కులను ప్రత్యేక చట్టాలు చేశారు. పూర్వంతో పోల్చుకుంటే నేటి మహిళలు చాలానే అభివృద్ధి చెందారని చెప్పవచ్చు. ఒకప్పుడు వంటింటికి మాత్రమే పరిమితమైన మహిళలు నేడు అనేక రంగాలలో వ్యాపారవేత్తలుగా, ఉద్యోగురాలిగా, రాజకీయ నాయకురాలిగా, పోలీస్ ఆఫీసర్‌గా, టీచర్ గా, డాక్టర్‌గా, లాయర్‌గా, కలెక్టర్‌గా ఇలా అనేక రంగాలలో తమ సత్తా ను చాటుతున్నారు. ఈ అభివృద్ధి అనేది ఒక్కసారిగా వచ్చింది కాదు, కాలానుగుణంగా అభివృద్ధి చెందుతుంది. స్త్రీని బలహీనురాలిగా అనుక్షణం రక్షణ తప్పనిసరి అన్న రీతిలో మనుధర్మ శాస్త్రం పేర్కొని ఉండవచ్చు. కానీ తరతరాలుగా రగులుతూ వస్తున్న చైతన్యం, ధైర్యం భారతీయ మహిళ స్వంతం. బానిస విక్రయాల కాలం దాటింది, సతీసహగమనం, బాల్యవివాహాలు, కన్యాశుల్కం, పునర్వివాహ ఉద్యమాలు, వరకట్నపు చావులు, భ్రూణహత్యాలు ఆఖరికి ఇప్పుడు యాసిడ్ దాడులు, పెట్రోల్ దాడులు, గొంతుకోతలు గడపదాటింది. మొదలు తిరిగి ఇంటికి చేరే వరకు ఎన్ని ఇబ్బందులో. రోడ్డుసైడ్ రోమియో నుండి అత్యున్నత పదవిలో ఉన్నవారి వరకు అందరికీ అతివ లోకువే. దేశ ప్రథమ పౌరురాలు దగ్గరనుండి పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు, పలు పార్టీల నేతలుగా మహిళలు సమర్థవంతంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలు, బ్యాంకులకు సారథులు మహిళలే.
ఇంత ప్రగతి సాధించినా ఇంకా మగవారి కన్నా బాధ్యతల బరువు మోతతో మహిళలకు వెతలు తప్పడంలేదు. అభివృద్ధి పథంలో భాగంగా ముందుకు సాగుతూ తమకంటూ ఓ ప్రత్యేకతను చాటుకుంటున్నారు. ఇప్పుడు ప్రభుత్వం మహిళలకు అన్ని రంగాలలో 33% రిజర్వేషన్‌ను కూడా కల్పించింది. దేశాన్ని పాలించే ప్రభుత్వాధినేతలు, కార్పొరేట్ రంగంలో దూసుకుపోతున్న ధీర వనితల, వాణిజ్య రంగంలో వెలుగొందుతున్న అతివలు, క్రీడా రంగంలో కాంతులీనుతున్న క్రీడామణులు, బహుళ జాతి కంపెనీలకు అధిపతులు, సామాన్య కుటుంబాన్ని నడిపించే గృహిణులు, వ్యవసాయం చేసే వీరవనితలు ఇలా రాజకీయవేత్తల నుండి శాస్త్రవేతల వరకు, పైలెట్ నుండి ఆస్ట్రోనాట్స్ వరకు లాయర్లుగా, డాక్టర్లుగా, కార్పొరేట్ సిఇఒలుగా ఎందరో మహిళలు కీర్తిశిఖరాలను అధిరోహిస్తున్నారు. ఇలా ఎందరో మరెందరో వీరందర్ని చూస్తుంటే ఒక అతివ సాధించే విజయానికి హద్దులు లేవు అనిపిస్తుంది. సమాజ జీవితంలో స్త్రీ, పురుషులిరువురు సమాన భాగస్థులే. అప్పుడే పురుషుని దృష్టిలో స్త్రీ అబల కాకుండాసబలగా భావించబడుతుంది. అందుకే స్త్రీలు అందరూ విద్యావంతులు కావాలి. భారతీయ మహిళలు అభివృద్ధి అయితేనే దేశం అభివృద్ధి చెందుతున్న సత్యాన్ని అందరూ గ్రహించాలి. ప్రస్తుతం మహిళలకు అన్ని రంగాలలో ధైర్యంగా తమ విధులను నిర్వర్తిస్తున్నారు.
టి.సంయుక్తా
కృష్ణమూర్తి
85001 75459