Reading Time: 2 minutes

మధ్యప్రాచ్యం ప్రాంతంలో 2026 మార్చి నాటికి నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు -ప్రత్యేకంగా అమెరికా, ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య పెరుగుతున్న ఘర్షణ-ప్రపంచ లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ (ఎల్‌పిజి) మార్కెట్‌పై గంభీరమైన ప్రభావాన్ని చూపుతున్నాయి. మధ్యప్రాచ్య ప్రాంతం ప్రపంచ ఇంధన సరఫరా వ్యవస్థలో కీలక స్థానాన్ని ఆక్రమించి ఉండటం వల్ల అక్కడ ఏర్పడే ప్రతి ఉద్రిక్తత అంతర్జాతీయ మార్కెట్లను వెంటనే ప్రభావితం చేస్తుంది. ప్రస్తుతం ఏర్పడిన యుద్ధ వాతావరణం ప్రపంచ ఇంధన వ్యవస్థకు ఒక పెద్ద సవాలుగా మారింది. ఎల్‌పిజి అనేది క్రూడ్ ఆయిల్ శుద్ధి ప్రక్రియలోను, సహజ వాయువు ఉత్పత్తిలోను లభించే ఒక ముఖ్యమైన ఉపఉత్పత్తి. అందువల్ల క్రూడ్ ఆయిల్ ధరల పెరుగుదల, సహజ వాయువు ఉత్పత్తిలో అంతరాయం, సముద్ర రవాణా మార్గాల్లో భద్రతా సమస్యలు -ఇవన్నీ నేరుగా ఎల్‌పిజి సరఫరా , ధరలపై ప్రభావం చూపుతాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఎల్‌పిజి మార్కెట్ ఒక విధంగా ‘రెండు వైపుల ఒత్తిడి’ ను ఎదుర్కొంటోంది. ఒకవైపు ముడి చమురు ధరలు పెరుగుతుండగా, మరోవైపు సముద్ర మార్గాల్లో రవాణా అంతరాయం ఏర్పడుతోంది.

ప్రపంచ ఎల్‌పిజి సరఫరాలో అత్యంత కీలకమైన మార్గమైన హోర్ముజ్ జలసంధి ఈ నేపథ్యంలో ప్రధాన ఆందోళనగా మారింది. ప్రపంచ ఎల్‌పిజి రవాణాలో సుమారు 40 శాతం వరకు ఈ జలసంధి ద్వారానే జరుగుతుంది. ఈ ప్రాంతంలో భద్రతా పరిస్థితులు క్షీణించడంతో అనేక గ్యాస్ ట్యాంకర్లు తమ ప్రయాణాలను ఆలస్యం చేయడం లేదా తాత్కాలికంగా నిలిపివేయడం జరుగుతోంది. ఫలితంగా సరఫరా గొలుసు అంతరాయం చెందుతూ ప్రపంచ మార్కెట్‌లో అనిశ్చితిని పెంచుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో భారతదేశం వంటి దేశాలకు ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుంది. భారతదేశం తన గృహ అవసరాల కోసం వినియోగించే ఎల్‌పిజిలో సుమారు 85 శాతం వరకు దిగుమతులపై ఆధారపడుతోంది. ఈ దిగుమతుల్లో ప్రధాన భాగం ఖతార్, సౌదీఅరేబియా వంటి మధ్యప్రాచ్య దేశాలనుంచే వస్తుంది. అందువల్ల సముద్ర రవాణా వ్యవస్థలో ఏ చిన్న అంతరాయం ఏర్పడినా దేశీయ సరఫరా వ్యవస్థపై ప్రత్యక్ష ప్రభావంపడే అవకాశముంది. సాధారణ పరిస్థితుల్లో కొంతకాలానికి సరిపడే నిల్వలు ఉన్నప్పటికీ, అంతర్జాతీయ సరఫరా ఎక్కువకాలం అంతరాయం కలిగితే ఈ నిల్వలు కూడా వేగంగా తగ్గే ప్రమాదం ఉంది.

ఇదే సమయంలో ప్రపంచ మార్కెట్‌లో ఎల్‌పిజి ధరలు కూడా పెరుగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌కు మార్గదర్శకంగా పరిగణించే సౌదీ అరామ్‌కో కాంట్రాక్ట్ ప్రైజ్ (సిపి) ఇటీవల గణనీయంగా పెరిగింది. అదనంగా యుద్ధ ప్రమాద బీమా (war-risk insurance) ఖర్చులు పెరగడం, సముద్ర రవాణా ఖర్చులు అధికమవడం వల్ల మొత్తం సరఫరా వ్యయం కూడా పెరుగుతోంది. దీని ప్రభావం చివరకు వినియోగదారులపై ధరల రూపంలో పడే అవకాశాన్ని కూడా విస్మరించలేం. ఇప్పటికే కొనసాగుతున్న రష్యా ఉక్రెయిన్ యుద్ధం ప్రపంచ ఇంధన మార్కెట్‌ను ముందుగానే ఒత్తిడిలోకి నెట్టింది. యూరోపియన్ యూనియన్, రష్యా నుంచి వచ్చే ఎల్‌పిజి దిగుమతులను పూర్తిగా నిషేధించడంతో యూరప్ దేశాలు ఇతర దేశాల సరఫరాపై ఆధారపడాల్సి వచ్చింది. ఈ పరిణామం ప్రపంచ మార్కెట్‌లో పోటీని పెంచి సరఫరా సమతుల్యతను మరింత సంక్లిష్టంగా మార్చింది. ఈ పరిస్థితుల్లో దేశీయ స్థాయిలో సరఫరా వ్యవస్థను సమర్థంగా నిర్వహించడం అత్యంత అవసరం. వినియోగదారులు, ఎల్‌పిజి డిస్ట్రిబ్యూటర్లు, ఆయిల్ మార్కెటింగ్ సంస్థలు, రాజకీయ నాయకులు, సంబంధిత అధికారులు పరస్పర సమన్వయంతో వ్యవహరించాల్సిన సమయం ఇది. అవసరానికి మించి నిల్వలు చేయడం లేదా అనవసర భయాందోళనలు సృష్టించడం పరిస్థితిని మరింత క్లిష్టతరం చేయవచ్చు. అందువల్ల పరస్పర అవగాహనతో, బాధ్యతతో ముందుకు సాగడం అత్యంత అవసరం.అదే సమయంలో తనిఖీలు నిర్వహించే అధికారులు కూడా ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని సమయోచితంగా వ్యవహరించాలి. చిన్న చిన్న పరిపాలనా అంశాల ఆధారంగా అనవసర ఒత్తిళ్లు సృష్టించడం కంటే సరఫరా వ్యవస్థ సాఫీగా కొనసాగేందుకు సహకరించడం ముఖ్యమైనది.

సరఫరా గొలుసులో ఉన్న ప్రతి ఒక్కరూ బాధ్యతతో వ్యవహరిస్తేనే ఈ సంక్షోభాన్ని సమర్థంగా ఎదుర్కోవచ్చు. ఏదేమైనా యుద్ధ పరిస్థితులు కొనసాగితే గ్యాస్ సిలిండర్ల సరఫరాలో కొంత ఆలస్యం లేదా జాప్యం కలగడం సహజం. అలాంటి సందర్భాల్లో సహనం, పరస్పర అవగాహన, సమన్వయం అత్యంత అవసరం. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో భారత ప్రభుత్వం ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఎలాంటి చర్యలు చేపడుతుంది, సరఫరా వ్యవస్థను స్థిరంగా ఉంచేందుకు ఎలాంటి పకడ్బందీ చర్యలు తీసుకుంటుంది అన్నది చూడాల్సి ఉంది. దేశంలోని కోట్లాది కుటుంబాల వంటింటిని ప్రభావితం చేసే ఈ అంశంలో ప్రభుత్వం తీసుకునే చర్యలు అత్యంత కీలకంగా మారనున్నాయి.ఈ అనివార్య పరిస్థితి వినియోగదారులకు మాత్రమే కాక ప్రపంచ దేశాలందరికీ ఒక విధంగా అగ్నిపరీక్ష వంటిదే. ఇలాంటి సందర్భాల్లో పరస్పర సహకారం, బాధ్యత, సహనం ద్వారానే సమస్యలను అధిగమించగలం. ప్రపంచం ఎదుర్కొంటున్న ఈ అసాధారణ పరిస్థితుల్లో సమన్వయం, సహనం, బాధ్యతాయుతమైన వ్యవహారమే మనకు మార్గదర్శకం కావాలి మిత్రమా.

పివి రావ్