
తిరుపతి: టిటిడి ఛైర్మన్ బిఆర్ నాయుడుకు దువ్వాడ శ్రీనివాస్ సూటి ప్రశ్నలు సంధించారు. దివ్వెల మాధురి, నటి తనూజలపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు టిటిడి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఎమ్మెల్సీ దువ్వాడ వీడియో విడుదల చేశారు. తిరుమలలో తనూజ జరుపుకున్న పుట్టినరోజు వేడుకల్లో గుడ్డు వాడనటువంటి కేక్‌ని కట్ చేయడం జరిగిందని స్పష్టం చేశారు. కేక్ కు సంబంధించిన రశీదు, షాపు కూడా ఉందని తెలియజేశారు. కేక్‌ను తిరుమలకు తీసుకెళ్లడం కట్ చేయడం అనేది టిటిడి నిబంధనలకు విరుద్ధమనే తమకు తెలియదని, స్వామి వారి క్షమించాలని వేడుకున్నామని చెప్పారు. ఇటీవల వార్తలో వైరల్ గా మారిన బిఆర్ నాయుడు రాసలీలల, కిచెన్ కౌగలింతుల వీడియోలను ప్రస్తావించారు. ఆ వీడియోల్లో ఎలాంటి తప్పు లేదని బిఆర్ నాయుడు చెబుతున్నాడని, తిరుమలలో జరిపిన పుట్టినరోజు వేడుకల్లో మాత్రం తప్పు ఎందుకు కనిపిస్తుందని సూటిగా దువ్వాడ ప్రశ్నించారు. నాయుడు రాసక్రీడలను డైవర్ట్ చేయడానికి కేక్ కటింగ్ ను తెరపైకి తీసుకొచ్చి వైరల్ చేశారని మండిపడ్డారు. ఈ కేసులో అరెస్టు చేస్తామని బెదిరిస్తున్నారని, తాము భయపడే రకం కాదని హెచ్చరించారు. బిగ్‌బాస్ ఫేమ్ తనూజ పుట్టిన రోజు వేడుకలను టిటిడి అతిథి గృహంలో దివ్వెల మాధురి నిర్వహించడంతో ఆ ఇద్దరిపై పోలీసులకు టిటిడి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.