Reading Time: 3 minutes

అప్పట్లో ప్రధాని ఇందిరాగాంధీని ఒక ప్రశ్న అడిగి చెన్నమనేని రాజేశ్వర్ రావు సంచలనం సృష్టించారు. మీరు మరింత నిరంకుశంగా మారుతున్నారా అని ఇందిరాగాంధీనే నేరుగా అడిగిన గుండెబలం గల ఘనాపాటి రిపోర్టర్ ఆయన. హైదరాబాద్‌లో జరిగిన ఆ పత్రికా సమావేశంలో ఈ ప్రశ్న విన్న ఇందిరాగాంధీ ఆ మాట మీరెలా చెప్పగలరని ఎదురు ప్రశ్న వేసి వివరణ కోరారు. కేబినెట్‌లో మంత్రివర్గ శాఖల పునర్వవస్థీకణ చేస్తూ హోం, రెవెన్యూ శాఖలలోని ఇంటెలిజన్స్ విభాగాలని ప్రధానమంత్రి పరిధిలోకి తీసుకోవడం అనేది మరింత నిరంకుశత్వానికి దారితీస్తుందని రాజేశ్వరరావు తన జవాబుగా వివరించారు. దానికి సమాధానం ఇవ్వని ఇందిరాగాంధీ చిరునవ్వు నవ్వి, తెలివిగా తరువాతి ప్రశ్నకు వెళ్ళిపోయారు!

తెలుగువారు గర్వించదగ్గ జర్నలిస్టు. వారు అనునిత్య చదువరి. ఇంగ్లీషు, తెలుగులో నిష్ణాతులైన పాత్రికేయులు. ఢిల్లీలో తొలిసారి ఒక తెలుగు పత్రికకు (ఆంధ్ర పత్రికకు) కరస్పాండెంట్‌గా పూర్తిస్థాయిలో పనిచేసిన వ్యక్తి. 1965 నుంచి ఒక 17 ఏళ్లు ‘ఆంధ్ర పత్రిక’ ప్రతినిధిగా సేవలందించి తెలుగు జర్నలిస్టుల గౌరవాన్ని రాజధానిలో ఇనుమడింప చేశారు. అంతకు ముందు ఎంతోమంది తెలుగు ప్రముఖులు ఆంగ్ల పత్రికా సంపాదకులుగా రాణించారు, కానీ తెలుగు పత్రికలకు ప్రతినిధులుగా వార్తలు రాయలేదు. రాజకీయ నాయకుడుగా కూడా రాణించిన వి.బి. రాజు నడిపిన ఇంగ్లీషు దినపత్రిక ‘డైలీ న్యూస్’లో 1963 లో చేరి రెండేళ్ళు పని చేశారు. రాజేశ్వర్ రావు ప్రతిభను గమనించి ’ఆంధ్రపత్రిక’ యజమాని శివలెంక శంభు ప్రసాద్ కొన్ని రోజులపాటు ఇంటర్వ్యూ నిర్వహించి, అటు పిమ్మట చివరి రోజున అప్పాయింట్‌మెంట్ ఆర్డర్ ఇచ్చి తొలుత హైదరాబాద్‌కి, తర్వాత ఢిల్లీకి తమ పత్రికా ప్రతినిధిగా పంపారు. 1981లో ఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన తరువాత విద్యున్మండలి అధికారిగా, ‘ఉదయం’ ప్రత్యేక ప్రతినిధిగా పనిచేసిన తర్వాత నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, కోట్ల విజయభాస్కరరెడ్డి ముఖ్యమంత్రులుగా పనిచేసినప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి ఇన్ఫర్మేషన్ అడ్వైజర్‌గా సేవలందించారు. తరువాతి కాలంలో ఆంధ్రజ్యోతి, వార్త దినపత్రికల ప్రత్యేక ప్రతినిధిగా కూడా సేవలందించారు.

ఆయన సామర్థ్యం, విలువలు గురించి ఆలోచించినప్పుడు ‘ఆంధ్రపత్రిక’ సంబంధించి ఒక సంఘటనా, మరో దినపత్రికకు సంబంధించి ఇంకో సంఘటన గురించి ప్రముఖంగా చెప్పుకోవాలి. కాసు బ్రహ్మానందరెడ్డి ముఖ్యమంత్రిగా ఒక సంవత్సరం పూర్తి చేసిన సందర్భంలో విజయాలతోపాటు తీసుకున్న పొరపాటు నిర్ణయాలను కూడా సమీక్షిస్తూ ‘ఆంధ్ర పత్రిక’లో చెన్నమనేని వ్యాసం రాశారు. ‘ఆంధ్ర పత్రిక’ యజమాని శంభుప్రసాద్, కాసు బ్రహ్మానందరెడ్డి అన్యోన్యమైన మిత్రులు కనుక, మరుసటి రోజు యజమాని నుంచి పిలుపు రాగానే ఉద్యోగం పోయిందని రాజేశ్వరరావు భావించారు. అయితే అనుకోని విధంగా శంభుప్రసాద్ నుంచి అభినందనలు రావడమే కాకుండా, తరువాతి కాలంలో మరింత గౌరవం కల్పిస్తూ తమ ప్రతినిధిగా ఢిల్లీకి పంపారు. ఇది వారి జర్నలిస్టు జీవితంలో తొలి సంవత్సరాలలో జరిగింది కాగా; రెండు దశాబ్దాల తర్వాత జరిగిన మరో సంఘటన కారణంగా తన ఉద్యోగానికే రాజీనామా చేశారు. తాను సన్యాసినంటూ అప్పటి ముఖ్యమంత్రి ఎన్‌టి రామారావు ప్రకటించిన మరుసటి రోజే ఆయన పేరున ఉన్న ఆస్తుల వివరాలన్నీ సేకరించి వాటి ఆధారంగా చెన్నమనేని పెద్ద వ్యాసమే రాశారు. అప్పటి ముఖ్యమంత్రి నుంచి ఎటువంటి స్పందన వచ్చిందో సమాచారం లేదు.

కానీ పర్యవసానంగా సదరు పత్రికా యజమాని జగదీష్ ప్రసాద్ పిలిచి విజయవాడకు బదిలీ చేస్తున్నట్టు చెప్పారు. కానీ రాజేశ్వరరావు తన నియామకం హైదరాబాదు రిపోర్టురుగానే, కాబట్టి బదిలీచేసే అధికారం ఆ సంస్థకు లేదని తనే రాజీనామా చేసి అక్కడి నుంచి తప్పుకున్నారు. బాగా గుర్తు నాకు, అది అక్టోబరు నాలుగు 2022! ఎందుకు గుర్తంటే అంతకు ముందు రోజు అడివి బాపిరాజు జర్నలిజం ప్రతిభ గురించి నేను రాసిన వ్యాసం చదివి, ఫోన్ చేసి ఉన్నారు. అయితే ఆయన నెంబరు నా దగ్గర లేదు, ఆయన చేసిన సమయంలో మరొకరితో మాట్లాడుతున్నాను. నేను మరల ప్రయత్నం చెయ్యలేదు, కానీ వారే మరుసటి రోజు రెండవసారి ఫోన్ చేశారు. తెలుగు దినపత్రికలలో డైలీ సీరియల్స్‌ని తొలిసారి ప్రవేశపెట్టిన సంపాదకుడు అడివి బాపిరాజు. 1944లో ‘మీజాన్’ తెలుగు దినపత్రిక హైదరాబాద్ లో ఆయన సంపాదకత్వంలో వెలువడినప్పుడు అందులో డైలీ సీరియల్ ప్రారంభించారు, అంతేకాదు విజయవంతమైన తన ఎన్నో నవలలను అందులో ప్రచురించారు. అంతకుముందు ‘ఆంధ్రపత్రిక’ డైలీలో వారానికోరోజు సీరియల్ నవల ఉండేది. ఈ ధోరణిని స్ఫూర్తిగా తీసుకుని బాపిరాజు దినసరి ధారావాహిక నవలా ప్రచురణను తెలుగు ‘మీజాన్’ పత్రికలో ప్రారంభించారు. అందుకే దినపత్రికలో డైలీ సీరియల్స్‌ను రాసిన తొలి సంపాదకుడు కూడా అడివి బాపిరాజే.

తెలంగాణ తెలుగు పత్రికలలో వ్యావహారిక భాషను ప్రవేశపెట్టడమే కాకుండా, అడివి బాపిరాజు వ్యంగ్య రచనల ప్రచురణతో పాటు సినిమా శీర్షికలను పూర్తి స్థాయిలో తెలంగాణ పత్రికల్లో తొలిసారి ప్రవేశపెట్టినవాడు కూడా. ఆయన దగ్గర పనిచేసిన ఉపసంపాదకులు తిరుమల రామచంద్ర, విద్వాన్ విశ్వం, రాంభట్ల కృష్ణమూర్తి, బిసికామరాజు మొదలైన వారు తరువాతి కాలంలో వేర్వేరు పత్రికల సంపాదకులుగా రాణించారు. ఇటువంటి విషయాలను బాపిరాజు జయంతి అక్టోబరు 8 సందర్భంగా 2022న ఓ తెలుగు డైలీ సాహిత్య పేజీ వ్యాసంలో నేను రాసినపుడు, ఫోన్‌లో అభినందించిన వ్యక్తి చెన్నమనేని రాజేశ్వర్‌రావు! అసలు కారణం ఏమిటంటే అడివి బాపిరాజు అసలు సంపాదకుడే కానట్టు ఆ మధ్యకాలంలో తెలుగుపత్రికల చరిత్ర రాసిన మరో సంపాదకుడి వాదనను పూర్వపక్షం చేస్తూ నా వ్యాసం సాగింది. ఆ రోజు టెలిఫోన్‌లో రాజేశ్వరరావు మరొక మాటను కూడా చెప్పారు;

తెలుగులో క్యాంపెయిన్ జర్నలిజాన్ని ప్రారంభించిన వారు నార్ల వెంకటేశ్వరరావు అని అంటూ మూడు, నాలుగు ఉదాహరణలను కూడా పేర్కొన్నారు. నాగార్జునసాగర్ మొదలైనప్పుడు దాని కారణంగా ఎంత విస్తీర్ణం అదనంగా సాగుబడి అవుతుంది? ఎంతమంది ఆకలి తీరుతుంది? ఏ స్థాయిలో మన సమాజం ఆర్థికంగా అభివృద్ధి సాధిస్తుంది? అనే విషయాలు చెప్పకుండా నాగార్జునుడు, బుద్ధుడు, బౌద్ధ స్థూపం అంటూ సంపాదకీయాలు రాయటం ఎలా సబబు అని ఆయన దీటైన ప్రశ్నలు సంధించారు. 2023 మార్చి 6వ తేదీన 82 ఏళ్ళ వయస్సులో హైదరాబాదులో చెన్నమనేని రాజేశ్వరరావు కనుమూసినపుడూ, తర్వాత్తర్వాత బాధ కలిగింది– ఇంతటి నిక్కచ్చితనం, ఇటువంటి నిజాయితీతో కూడిన అధ్యయన శీలమున్న రాజేశ్వరరావు గురించి ఇంకా ముందుగా నేనెందుకు తెలుసుకోలేకపోయానని! 1941 సెప్టెంబర్ 22న జన్మించిన చెన్నమనేని రాజేశ్వర్ రావు నికార్సయిన జర్నలిస్టు. వారి వ్యక్తిత్వాన్ని, పాత్రికేయ నిబద్ధతను తేటతెల్లం చేస్తూ ఒక విలువైన గ్రంథమింకా రావాల్సి ఉంది.

– డా. నాగసూరి వేణుగోపాల్ 

9440732392