
అమరావతి: బడ్జెట్ లో ఎపి సిఎం చంద్రబాబు నాయుడు దూరదృష్టి, దార్శనికత అడుగడుగునా ఉందని డిప్యూటీ సిఎం పవన్ కల్యాణ్ కొనియాడారు. న్యాయశాఖకు కూటమి ప్రభుత్వం చాలా ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. ఎపి అసెంబ్లీ సమావేశాల్లో ద్రవ్య వినిమయ బిల్లుపై పవన్ ప్రసంగించారు. కొత్తగా కోర్టు భవనాల నిర్మాణాలు కొనసాగుతున్నాయని, కోర్టులన్నింటిలో మౌలిక సదుపాయాలు కల్పించడం అత్యంత అవసరం అని తెలియజేశారు. గత ప్రభుత్వం చేసిందంతా విధ్వంసమేనని, వైసిపి ఆర్థిక విధ్వంసం వల్ల రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కి వెళ్లిందని పవన్ విమర్శించారు. వైసిపి ప్రభుత్వం రూ.10 లక్షల కోట్ల అప్పులు వదిలి వెళ్లిందని, కేంద్ర నిధులను కూడా దుర్వినియోగం చేసిందని ధ్వజమెత్తారు. విద్యావ్యస్థను వైసిపి ప్రభుత్వం నాశనం చేసిందని, విద్యుత్ సరఫరాలో కూడా ఇబ్బందులు వచ్చాయని మండిపడ్డారు.1.29 లక్షల కోట్లు విద్యుత్ సంస్థలు నష్టపోయాయని, ఆ భారాన్ని ప్రజలపై మోపారని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక వినూత్న కార్యక్రమాలు అమలు చేశామని, ప్రతి గ్రామానికి స్వచ్ఛమైన నీరు అందించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. జల్ జీవన్ మిషన్ కు కూలమి ప్రభుత్వం నిధులు కేటాయించిందని, మెగా డిఎస్ సి ద్వారా 16 వేలకు పైగా టీచర్ పోస్టులు భర్తీ చేయనున్నామని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.