Reading Time: 3 minutes

మనతెలంగాణ/హైదరాబాద్:తెలంగాణ నుంచి రాజ్యసభ సభ్యులుగా కాంగ్రెస్ పార్టీ నుంచి అభిషేక్‌మను సింఘ్వీ, వేం నరేందర్ రెడ్డిలు గురువారం నామినేషన్‌లు దాఖలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల అధికారి ఉపేం దర్ రెడ్డికి ఈ నామినేషన్ పత్రాలను వారు అందజేశారు. మంత్రులు కోమటిరెడ్డి వెంక ట్ రెడ్డి, శ్రీధర్‌బాబు నేతృత్వంలో సింఘ్వీ, వేం నరేందర్ రెడ్డిలు మొదటి, రెండు నామి నేషన్లు దాఖలు చేయగా సిఎం రేపంత్ రెడ్డి, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో కలిసి మూడో సెట్ నామినేషన్ పత్రాలను అసెంబ్లీ ఎన్నికల అధికారికి సమర్పించారు. ప్రస్తు తం ఈ రెండు రాజ్యసభ స్థానాలు ఏకగ్రీవం కానున్నట్టుగా తెలిసింది. మొత్తం రెండు స్థా నాల కోసం 3నామినేషన్లు దాఖలయ్యా యి. కాంగ్రెస్ తరఫున అభిషేక్ సిం ఘ్వీ, వేం నరేందర్‌రెడ్డి నామినేషన్ దాఖలు చేయ గా, స్వతంత్ర అభ్యర్థిగా 

సాయి అనే వ్యక్తి కూడా నామినేషన్ వేశారు. అభిషేక్ సింఘ్వీ మూడుసెట్లు, వేం నరేందర్ రెడ్డి నాలుగు సెట్లు, సాయి ఒక సెట్ నామినేషన్ దాఖలు చేశారు. అయితే, స్వతంత్ర అభ్యర్థి సాయి 10 మంది ఎమ్మెల్యేల సంతకాలు లేకుండా నామినేషన్ వేయడంతో స్క్రూటీనిలో ఆ నామినేషన్‌ను తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉంది. దీంతో సింఘ్వీ, వేం నరేందర్ ఏకగ్రీవం లాంఛనం కానున్నట్టుగా తెలిసింది. దీంతోపాటు బిఆర్‌ఎస్ అభ్యర్థులు బరిలో లేరు. అయితే, కాంగ్రెస్ రెండోసీటుకు పోటీచేస్తుండగా ఈ సీటు గెలవాలంటే కాంగ్రెస్‌కు సరిపడా మద్ధతు లేదు. దీనికోసం కాంగ్రెస్ పార్టీ మజ్లిస్ మద్ధతు తీసుకునే అవకాశం ఉందని తెలిసింది. ప్రస్తుతం మూడో అభ్యర్థి పోటీలో లేకపోవడంతో పోటీ ఏకగ్రీవమవుతుందని అధికారులు తెలిపారు.

నేడు స్క్రూటీని

దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాల్లోని మొత్తం 37 రాజ్యసభ స్థానాల భర్తీ కోసం నామినేషన్లు దాఖలయ్యాయి. దాఖలైన నామినేషన్ లను నేడు అధికారులు పరిశీలిస్తారు. పోటీ నుంచి తప్పుకోవాలనుకునే అభ్యర్థులకు మార్చి 9వ తేదీ వరకు అవకాశం ఉంది. ఏకగ్రీవం కానీ, పక్షంలో అవసరమైతే మార్చి 16వ తేదీన ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగనుంది. అదే రోజు సాయంత్రం 5 గంటలకు ఓట్లు లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటిస్తారు.

బిఆర్‌ఎస్ దూరం

రాజ్యసభ పోటీకి బిఆర్‌ఎస్ దూరంగా ఉంది. ఖాళీ అయిన రెండు స్థానాల్లో సురేశ్ రెడ్డి బిఆర్‌ఎస్ సిట్టింగ్ ఎంపి కాగా, తాజాగా ఇప్పుడు ఆ స్థానాన్ని గులాబీ పార్టీ కోల్పోయింది. ముగ్గురు అభ్యర్థులు పోటీ చేస్తే కనీసం 40 ఓట్లు సాధించే అభ్యర్థులు రాజ్యసభ ఎన్నికల్లో విజయం సాధిస్తారు. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 39 మంది బిఆర్‌ఎస్ తరఫున ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. వారికి సంఖ్యా బలం లేకపోవడంతో బిఆర్‌ఎస్ పోటీ నుంచి తప్పుకుంది.

రెండో స్థానం కోసం కాంగ్రెస్ నుంచి 16 మంది

గతంలో తెలంగాణ నుంచి రాజ్యసభకు వెళ్లిన అభిషేక్‌మను సింఘ్వీ పదవీకాలం మరికొద్ది రోజుల్లోనే ముగియనుంది. దీంతో మరోసారి సింఘ్వీకి కాంగ్రెస్ అధిష్టానం రాజ్యసభ సభ్యుడిగా అవకాశం కల్పించింది. ఇక, రెండోస్థానం కోసం కాంగ్రెస్ పార్టీలోని పలువురు సీనియర్లు సుమారుగా 16 మంది పోటీపడగా సిఎం రేవంత్‌రెడ్డి సన్నిహితుడు వేం నరేందర్‌రెడ్డి పేరును అధిష్టానం ఖరారు చేసిన విషయం తెలిసిందే.

ప్రభుత్వ సలహాదారు పదవికి వేం నరేందర్‌రెడ్డి రాజీనామా

సిఎం రేవంత్ రెడ్డికి రాజకీయ సలహాదారుగా వ్యవహారిస్తున్న వేం నరేందర్ రెడ్డి తన పదవికి గురువారం ఉదయం రాజీనామా చేశారు. కాంగ్రెస్ పార్టీ తరపున రాజ్యసభ అభ్యర్థిగా ఆయన నామినేషన్ దాఖలు చేయనున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. రాజ్యసభ అభ్యర్థిగా పోటీ చేసే వ్యక్తి లాభదాయక పదవుల్లో ఉండకూడదన్న నిబంధన ఉంది. ఈ నేపథ్యంలోనే సాంకేతిక ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు వేం నరేందర్ రెడ్డి తన ప్రభుత్వ సలహాదారు పదవిని వదులుకున్నారు. ఆయన రాజీనామాను సిఎస్ రామకృష్ణా రావు వెంటనే ఆమోదించారు. అనంతరం వేం నరేందర్ రెడ్డి, అభిషేక్ మను సింఘ్వీతో కలిసి మొదటి సెట్ నామినేషన్ దాఖలు చేసేందుకు అసెంబ్లీకి వెళ్లారు.

ఢిల్లీ పర్యటన ముగించుకొని

ఢిల్లీ పర్యటన ముగించుకున్న సిఎం రేవంత్ రెడ్డి గురువారం ఉదయం హైదరాబాద్‌లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. జాతీయ రాజధానిలో కాంగ్రెస్ అధిష్టానంతో రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై కీలక చర్చలు జరిపిన అనంతరం ఆయన నగరానికి తిరిగి వచ్చారు. అనంతరం అసెంబ్లీకి చేరుకున్న సిఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ తరపున రాజ్యసభ అభ్యర్థులుగా ఖరారైన అభిషేక్ మను సింఘ్వీ, వేం నరేందర్ రెడ్డిల మూడో సెట్ నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి సమర్పించారు.

అధిష్టానానికి ధన్యవాదాలు

నామినేషన్ సందర్భంగా అసెంబ్లీ ప్రాంగణంలో వేం నరేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తనకు రాజ్యసభ అవకాశం కల్పించిన అధిష్టానానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. పార్టీ ఆశీర్వాదంతోనే తనకు రాజ్యసభ అవకాశం దక్కిందన్నారు. అభిషేక్ సింఘ్వీ మాట్లాడుతూ తనకు రెండో సారి అవకాశం ఇచ్చిన హైకమాండ్‌కు ఆయన ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ సమాజం, తెలంగాణ ప్రజలకు రుణపడి ఉంటానన్నారు. తెలంగాణ అభివృద్ధి కోసం పాటుపడతానని ఆయన చెప్పారు.

ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిసిన సింఘ్వీ, వేం నరేందర్‌రెడ్డి

కాంగ్రెస్ తరఫున అభిషేక్ సింఘ్వీ, వేం నరేందర్ రెడ్డిలు నామినేషన్‌లు దాఖలు చేసిన అనంతరం హైదరాబాద్ పర్యటనకు వచ్చిన ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను వారిద్దరూ మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో సిఎం రేవంత్‌రెడ్డి, పిసిసి అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ ఉన్నారు.