Reading Time: 2 minutes

మన తెలంగాణ/హైదరాబాద్: ఎన్నికలు జరిగే అన్ని మున్సిపాల్టీలు, కార్పొరేషన్లలో మనమే గెలిచితీరాలని పార్టీ నేతలకు ము ఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిశా నిర్దేశం చేశారు. ఈ ఫలితాలు బిఆర్‌ఎస్-, బిజెపి నేతలకు దిమ్మతిరిగేలా ఉండాలని అన్నారు. అమెరికా పర్యటనలో ఉన్న సిఎం రేవంత్‌రెడ్డి శనివారం ఉదయం ము న్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పిసిసి అధ్యక్షుడు, ఎంఎల్‌సి మహేష్‌కుమార్ గౌడ్, పార్టీ రాష్ట్ర ఇంచార్జి మీనాక్షి నటరాజన్‌తో పాటు మంత్రు లు, జిల్లా పార్టీ అధ్యక్షులు, లోక్‌సభ నియోజకవర్గాల ఇంచార్జీలు, ముఖ్య నేతలతో జూమ్ మీ టింగ్ ద్వారా మాట్లాడారు. తొలుత పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పార్టీ నుంచి తెప్పించిన సర్వే నివేదికలను వివరించినట్టు సమాచారం. ఈ సం దర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, ఈ ఎన్నికల్లో తొంభై శాతం స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందాలని అన్నారు. ఈ లక్ష్యాన్ని సాధించడానికి అందరూ సమిష్టిగా పని చేయాలని ఆయన పిలుపునిచ్చారు. సమిష్టి కృషి వల్లే జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో మంచి మెజారిటీతో పార్టీ అభ్యర్థి గెలుపొందారని ఆయన ఈ సందర్భంగా ఉదహరించినట్లు పార్టీ వర్గాలు తెలిపారు.

ఆషా-మాషీగా తీసుకోవద్దు..

మున్సిపల్ ఎన్నికలు చిన్నవే కదా అని ఆషా-మాషీగా తీసుకోరాదని ముఖ్యమంత్రి అన్నారు. ఇప్పుడు గెలుపొందిన వారే మనకు వచ్చే అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలకు పట్టుకొమ్మల్లా, పిల్లర్ల తరహాలో గట్టిగా నిలబడతారని ఆయన పేర్కొన్నారు. కాబట్టి అభ్యర్థుల ఎంపిక విషయంలోనూ జాగ్రత్తలు తీసుకోవాలని, వత్తిళ్ళకు లొంగి టిక్కెట్లు ఇస్తే నష్టపోతామని ఆయన హెచ్చరించారు. బంధు-మిత్రులనో, ఎవరో ముఖ్య నేత రెకమండ్ చేశారనో టిక్కెట్ కేటాయిస్తే నష్టపోతామని, ఇలాంటి అనుభవం మనకు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అయ్యిందని ఆయన గుర్తు చేశారని పార్టీ నాయకుల భోగట్టా. మంచి అభ్యర్థులను, ముఖ్యంగా పార్టీ కోసం నిరంతరం శ్రమించిన వారిని అభ్యర్థులుగా ఎంపిక చేస్తే, ఓట్లు వేసే వారు కూడా పార్టీలకు అతీతంగా మన పార్టీ అభ్యర్థికి ఓటు వేసేందుకు ఆసక్తి కనబరుస్తారని ఆయన చెప్పారని తెలిసింది.

రెబెల్స్‌ను బుజ్జగించేందుకు కమిటీ

ఎన్నికల్లో పోటీ చేసేందుకు చాలా మంది ముందుకు వస్తున్నారని పిసిసి అధ్యక్షుడు మహేష్‌కుమార్ గౌడ్ చెప్పడాన్ని ముఖ్యమంత్రి ప్రస్తావిస్తూ, అధికార పార్టీకి ఈ తాకిడి తప్పని సరిగా ఉంటుందన్నారు. అయితే టిక్కెట్ కోసం ముందుకు వచ్చిన ఆశావాహులందరినీ ఒక చోట సమావేశపరిచి భవిష్యత్తులో ఇంత కంటే మంచి అవకాశం కల్పిస్తామని, తొందరపడి రెబెల్స్‌గా పోటీ చేసి పార్టీ అభ్యర్థికి నష్టం కలిగించరాదని నచ్చజెప్పాలని సూచించారు. పార్లమెంటు ఇన్‌ఛార్జిలు ఈ బాధ్యత తీసుకోవాలన్నారు. అవసరమైతే ఇందుకు ఉప కమిటీలు నియమించుకోవాలని, బి-ఫారం ఇచ్చే ముందు స్క్రీనింగ్ కమిటీలను ఏర్పాటు చేసుకోవాలన్నారు.

బలహీనంగా ఉన్న చోట్ల..

ఇక బలహీనంగా ఉన్నామని భావించే చోట మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టీ నేతలకు సూచన చేశారు. మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ ఇతర పార్టీల్లో టిక్కెట్ దక్కని వారు ఎవరైనా ముందుకు వస్తే చేర్చుకునే విషయంపైనా దృష్టి సారించాలని సూచించారు. ఇదే సమయంలో మీనాక్షి నటరాజన్ కల్పించుకుని ప్రచార ఏర్పాట్ల గురించి ప్రస్తావించారు. మహేష్ కుమార్ గౌడ్ స్పందిస్తూ పార్లమెంటు వారీగా నియమితులైన ఇన్‌ఛార్జి మంత్రులపైనే ప్రచార బాధ్యత పెట్టామన్నారు. అభ్యర్థుల ఎంపిక విషయంలో ఏకాభిప్రాయం కుదరకపోతే పిసిసి అధిష్టానం దృష్టికి తీసుకుని రావాల్సిందిగా తాను ఇదేవరకే ఆదేశాలు జారీ చేశానని ఆయన చెప్పారు.

ప్రచారంలో పాల్గొంటా..: సిఎం

తిరిగి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తాను శనివారం (ఫిబ్రవరి ఒకటో తేదీన) హైదరాబాద్‌కు చేరుకోబోతున్నానని, వచ్చిన తరువాత ప్రచారంలో విస్తృతంగా పాల్గొంటానని వివరించారు.

గద్దర్‌కు ఘన నివాళి..

ఇదిలాఉండగా గద్దర్ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘన నివాళి అర్పించారు. గద్దర్ ఆశయాల సాధన కోసం తాము కృషి చేస్తున్నామన్నారు. గద్దర్ పేరిట కవులు, కళాకారులకు అవార్డులు ఇస్తున్న విషయాన్ని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారని పార్టీ వర్గాలు తెలిపాయి.