
కనువిందు చేయనున్న క్రికెట్, ఫిఫా వరల్డ్‌కప్
అలరించనున్న కామన్వెల్త్ గేమ్స్, ఆసియా క్రీడలు
మన తెలంగాణ/క్రీడా విభాగం: కొత్త ఏడాది 2026 పలు మెగా క్రీడా పోటీలకు వేదికగా నిలువనుంది. ఈ సంవత్సరం పలు పెద్ద క్రీడా సంగ్రామాలు జరుగనున్నాయి. రెండు క్రికెట్ వరల్డ్‌కప్‌లతో పాటు ఫిఫా ప్రపంచకప్, కామన్వెల్త్ గేమ్స్, ఆసియా క్రీడలు, వింటర్ ఒలింపిక్స్, ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ వంటి మెగా క్రీడా పోటీలు 2026లో జరుగనున్నాయి. ప్రతిష్ఠాత్మకమైన ఐసిసి పురుషుల టి20 వరల్డ్‌కప్ ఫిబ్రవరి ఏడు నుంచి మార్చి 8 వరకు జరుగనుంది. ఈ టోర్నమెంట్‌కు భారత్, శ్రీలంకలు సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్నాయి.
ఇక ప్రపంచంలోనే అతి పెద్ద క్రీడా సంగ్రామాల్లో ఒకటిగా పేరు తెచ్చుకున్న ఫుట్‌బాల్ వరల్డ్‌కప్ కూడా ఈ ఏడాదే జరుగనుంది. జూన్ 11 నుంచి జులై 19 వరకు జరిగే ఈ మెగా టోర్నీని కెనడా, మెక్సికో, అమెరికాలు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. ఇందులో 48 దేశాల జట్లు పాల్గొంటున్నాయి. ఇక ఒలింపిక్స్ తర్వాత రెండో అతి పెద్ద క్రీడా సంగ్రామంగా పేరున్న కామన్వెల్త్ గేమ్స్ కూడా 2026లోనే జరుగనున్నాయి. జులై 23 నుంచి ఆగస్టు రెండు వరకు స్కాట్లాండ్ వేదికగా ఈ పోటీలు నిర్వహిస్తున్నారు. మరోవైపు ప్రతిష్ఠాత్మకమైన ఆసియా క్రీడలకు కూడా 2026 వేదికగా నిలువనుంది.
సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 4 వరకు జపాన్‌లోని ఐచినాగోయాలో ఈ పోటీలు జరుగుతాయి. వింటర్ ఒలింపిక్స్ కూడా 2026లోనే జరుగనున్నాయి. ఫిబ్రవరి ఆరు నుంచి 22 వరకు ఇటలీలోని మిలన్‌కోర్టినాలలో ఈ పోటీలను నిర్వహిస్తారు. అంతేగాక మహిళల టి20 వరల్డ్‌కప్ టోర్నీ కూడా ఈ ఏడాదే నిర్వహిస్తున్నారు. జూన్ 12 నుంచి జులై 5 వరకు ఇంగ్లండ్‌లో జరుగనున్నాయి. దీంతో పాటు భారత రాజధాని ఢిల్లీ వేదికగా ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ కూడా ఈ ఏడాదే జరుగనుంది. అంతేగాక మహిళలు, పురుషుల క్రికెట్ ప్రీమియర్ లీగ్ పోటీలు కూడా అభిమానులను అలరించనున్నాయి.