
తెలంగాణ ప్రసిద్ధి క్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. గురవారం ఆంగ్ల నూతన సంవత్సరం కావడంతో స్వామి, అమ్మవార్ల దర్శనానికి వివిధ ప్రాంతాల నుంచి భారీగా తరలివచ్చారు. కొత్త సంవత్సరం తొలి రోజు స్వామి, అమ్మవార్లను దర్శించుకోవడంతో తమ జీవితాల్లో సంవత్సరమంతా ఆనందం ఉంటుందని భక్తుల నమ్మకం. తెలంగాణతో పాటు ఏపీ, కర్ణాటక, తమిళనాడు తదితర రాష్ట్రాలకు నుండి తరలివచ్చిన భక్తులతో యాదగిరి కొండ నిండిపోయింది. శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి కొండపైన, కొండ కింద పలు ప్రాంతాల్లో ఎటు చూసినా భక్తుల రద్దీ కనిపించింది. స్వామి వారి దర్శన క్యూలైన్లు, ప్రసాద విక్రయ కేంద్రాలు, గదుల విచారణ కార్యాలయం, టికెట్ల విక్రయ కేంద్రాలు, పార్కింగ్, బస్టాండ్, పుష్కరిణి, తలనీలాలు సమర్పించే కేంద్రం, శ్రీసత్యనారాయణ వ్రత మండపంతో పాటు పరిసర ప్రాంతాల్లో భక్తులు సందడి చేశారు. అశేషంగా తరలివచ్చిన భక్తులు స్వామి, అమ్మవార్లను దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. స్వామి వారి ఉచిత దర్శనానికి 5 గంటలకు, సర్వ దర్శనానికి 3 గంటల సమయం పట్టినట్లు ఆలయ అధికారులు తెలిపారు.
కొనసాగుతున్న నిత్యపూజలు..
శ్రీలక్ష్మీనరసింహస్వామి వారికి నిత్యపూజలు కొనసాగుతున్నాయి. గురువారం తెల్లవారుజామున ఆలయాన్ని తెరిచిన అర్చకులు సుప్రభాతం, అర్చనను శాస్త్రోక్తంగా నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనాలకు అనుమతించారు. శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్న భక్తులు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలో జరిగిన శ్రీసత్యనారాయణస్వామి వ్రత పూజలతో పాటు పలు సేవల్లో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం కొండపైన కొలువైన శ్రీపర్వతవర్ధినీ సమేత రామలింగేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పాతగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకొని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ధనుర్మాసోత్సవాల సందర్భంగా తెల్లవారుజామున గోదాదేవికి తిరుప్పాని వేదోక్తంగా నిర్వహించారు. మహిళా భక్తులు మంగళహారతులతో వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు.
యాదగిరీశుడికి భారీగా ఆదాయం..
యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారికి గురువారం వివిధ శాఖల నుంచి భారీగా ఆదాయం వచ్చింది. నిత్యరాబడిలో భాగంగా స్వామి, అమ్మవార్లకు రూ.50,11,920 ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ప్రధాన బుకింగ్ ద్వారా రూ.1,70,400, బ్రేక్ దర్శనం ద్వారా రూ.5,44,200, శ్రీసత్యనారాయణ వ్రతాల ద్వారా రూ.1,11,000, రూ.150 వీఐపీ దర్శనం ద్వారా రూ.7,95,000, కొండపైకి వాహన ప్రవేశం ద్వారా రూ.8,19,500, సువర్ణ పుష్పార్చన ద్వారా రూ.99,000, ప్రసాద విక్రయం ద్వారా రూ.20,01,980, కల్యాణకట్ట ద్వారా రూ.78,000తోపాటు వివిధ శాఖలు, పాతగుట్ట ఆలయం ద్వారా ఆదాయం సమకూరినట్లు అధికారులు తెలిపారు.